HomeNewsBreaking Newsనిధులు ఆగవు

నిధులు ఆగవు

ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టీకరణ
ఈ ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి, ఆరు నెలల్లో డిండి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
అధికారులకే నిధుల మంజూరు, విడుదల అధికారం
ప్రజాపక్షం / హైదరాబాద్‌ వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ఫ్లోరైడ్‌, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగో డు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందిం చే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగ వద్దని, ఈ ఏడా ది బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ వరకు రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. పాలమూరు డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, సురేందర్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్‌సిలు మురళీధర్‌ రావు, సిఇలు మోహన్‌ కుమార్‌, రమేశ్‌, రఘునాథరావు, ఎస్‌ఇలు ఆనంద్‌, విజయభాస్కర్‌రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. పాలమూరు ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌, పంపుహౌస్‌, నార్లాపూర్‌ కాలువ, ఏదుల పంపుహౌస్‌, ఏదుల- కాలువ, వట్టెం రిజర్వాయర్‌, వట్టెం- కాలువ, కర్వెన రిజర్వాయర్‌, కర్వెన కాలువ, టన్నెల్‌ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ ఉద్దండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌ సాగర్‌, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సిఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవతుందని కెసిఆర్‌ అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సిఎం సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు. బిహెచ్‌ఇఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ను సిఎం కోరారు. విద్యుత్‌ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలని, మిషన్‌ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో ‘మినిమమ్‌ డ్యామ్‌ డ్రాయింగ్‌ లెవల్‌’ను మెయింటేన్‌ చేయాలన్నారు.
1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు 1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం” అని సిఎం కెసిఆర్‌ చెప్పారు. సాగునీరు అందించడంతో పాటు మిషన్‌ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారదుల శాఖకే ఉందని, దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగిందన్నారు. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిందని, వివిధ ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్‌ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సిఇ పరిధికి తేవడం జరిగిందన్నారు. డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌)కు ఒక్కొక్క పనికి రూ.1 కోటి మించకుండా సంవత్సరానికి రూ.25 కోట్ల వరకు, చీఫ్‌ ఇంజనీర్‌(సిఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్‌ (ఎస్‌ఈ)కు ఒక్కొక్క పనికి రూ.25 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్‌(ఇఇ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌(డి ఇఇ)కు ఒక్కొక్క పనికి రూ.2 లక్షలు మించకుండా సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ఇచ్చినట్లు సిఎం వివరించారు. ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని సిఎం కెసిఆర్‌ అధికారులను కోరారు. “నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, వివిధ అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదో అనే విషయంలో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. అవసరమైతే మార్పులు చేయాలి” అని సిఎం అధికారులను ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments