నేతాజీ వేడుకల్లో బిజెపిపై మమత ఆగ్రహం
బిజెపి,టిఎంసి పోటాపొటీ రాజకీయం
కార్యకర్తల మధ్య ఘర్షణ : పలువురికి గాయాలు
కోల్‌కత : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్రంలో శనివారంనాడు జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు రాజకీయ ప్రయోజనాలకు నెలవయ్యాయి. నేతాజీకి అసలై న వారస రాజకీయం తమదేనని చెప్పుకునేందుకు టిఎంసి- పోటాపోటీ పడ్డాయి. రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎన్నికల వేళ మోడీ నేతాజీని స్మరిస్తున్నారని, తమకు అలాంటి పనులు చేతకావని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి మోడీపై మండిపడ్డారు. నేతాజీ 365 రోజులూ తమ హృదయాల్లోనే ఉంటాడని ఆయన కుటుబంతో మేం ఎప్పుడూ సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూనే ఉంటాం అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా కోల్‌కతలో మమతా బెనర్జీ ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేశా రు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని, ఒకే రాజధాని అనే నినాదం నుండి బయటపడి కాలానుగుణంగా వ్యవహరించాలని అన్నారు. పరిపాలన సాగేందుకు వీలుగా సువిశాలమైన మన దేశం నలుమూలలా రాజధానులు పనిచేయాలని, మన ఆలోచనా దృక్పథంలో మార్పులు రావాలని అన్నారు. బ్రిటిష్ పాలకులు కోల్‌కత నుంచే దేశాన్ని పాలించారని గుర్తు చేశారు. నేతాజీ జయంతి సందర్భంగా మోడీ శనివారంనాడు బెంగాల్లో పర్యటించారు. నేతాజీ పూర్వీకుల ఇంటిని సందర్శించి ఆయన ఉపయోగించిన వస్తువులను తిలకించారు. నేతాజీ మనుమలతో కాసేపు గడిపారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. విశేషం ఏమిటంటే, ఒకవైపు విక్టోరియా మెమోరియల్‌లో జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి మోడీ, మమతా బెనర్జీ , గవర్నర్ జగదీప్ ధన్కర్లు ఒకే వేదికపై పాల్గొని ప్రసంగించగా, బిజెపి-టిఎంసి కార్యకర్తకలు హౌరా జిల్లాలో బాహీబాహీకి దిగారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. టిఎంసి కార్యకర్త తమపై కాల్పులకు దిగాడని, రాడ్లతో కర్రలతో కొట్టారనిబిజెపి ఆరోపించగా, బాలీ జిల్లాలో నాటు బాంబులు విరుసుకున్న కార్యకర్తలు వీధిపోరాటంతో భీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసమే నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించారని టిఎంసి ఆరోపించింది. ప్రధానితో కలిసి పాల్గొన్న వేదికపై మమత ఉండగానే మోడీ జిందాబాద్, జై శ్రీరామ్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో మమత ఆగ్రహించారు. సభకు పిలిచి అవమానిస్తారా? ఇది రాజకీయ సమావేశమా? హుందాగా వ్యవహరించాలి, అని మండిపడి తాను ఎక్కువ మాట్లాడను అంటూ తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. నేతాజీ ప్రతిపాదించిన, ఆయన కలలుగన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని సభలో మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన జయంతికి సెలవు ప్రకటించాలని మా ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? అని ఆమె ప్రశ్నించారు. కోల్‌కతలోని నేతాజీ భవన్లో బోస్‌కు నివాళులు అర్పించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఐక్యతకోసం ఆయన తన గళాన్ని వినిపించేవారని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వం 2014లో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది, ఆ స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు చేశారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావనలకు, కలలకు ప్రతిరూపం ప్రణాళికా సంఘం. దానిని ఎందుకు రద్దు చేశారు? అని ఆమె ప్రశ్నించారు. రవీంద్రనాథ్ ఠాగోర్ నేతాజీని దేశ్నాయక్గా అభివర్ణించారని గుర్తుచేస్తూ, అందుకే ఆయన జయంతిని దేశ్‌నాయక్ దివస్‌గా మేం పాటిస్తామని మమతా బెనర్జీ అన్నారు.
పిలిచి అవమానిస్తారా?
RELATED ARTICLES