నాలుగు విడతలుగా ఎన్నికలు
తొలి విడత నోటిఫికేషన్ విడుదల
ప్రజాపక్షం / విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజన్లలో నాలుగు విడతలుగా పం చాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో కలిపి 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలో 146 మండలాల్లో, రెండో విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169మండలాల్లో, నాలుగో విడతలో భాగంగా 19 రెవెన్యూ డివిజన్లలోని 171మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనాపరమైన, న్యాయపరమైన వివాదాల కారణంగా 17 మండలాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. అదే విధంగా విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. కాగా, తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘమని, ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి అన్నారు. ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలపడుతుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. “విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. ఐజి స్థాయి అధికారులతో ఏకగ్రీవాలపై దృష్టి పెడతాం. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయి. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్, న్యాయ సలహాదారు ఎవరు లేరు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టుకు వెళ్లాం. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదు. ప్రభుత్వ ఉదాసీనతను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లా. కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్నా కమిషన్ పనితీరులో అలసత్వం ఉండదు. ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకం. ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి” అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.
ఎపిలో పంచాయతీ నగారా
RELATED ARTICLES