అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
భారీగా నాయకుల అరెస్టు
పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట
రైతులకు అండగా పోరాటం చేస్తాం: ఉత్తమ్
ప్రజాపక్షం/హైదరాబాద్ ఢిల్లీ రైతుల ఉద్యమానికి సంఘీభావంగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన “చలో రాజ్‌భవన్” ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాటలు, స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఎఐసిసి పిలుపు మేరకు ఢిల్లీ రైతుల ఉద్యమానికి సంఘీభావంగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మంగళవారం “చలో రాజ్‌భవన్ ’ చేపట్టారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలోని సి ఎల్పి నుంచి సచివాలయం వరకు రాగానే వారిని పోలీసులు అడ్డుకు ని అరెస్ట్ చేశారు. వచ్చిన నేతలను వచ్చినట్టుగా అదుపులోనికి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క, ఎఐసిసి కార్యదర్శులు బోస్‌రాజు, మధుయాష్కీగౌడ్, శ్రీనివాస్ కృష్ణన్, డాక్టర్ చిన్నారెడ్డి, ఎ.సంపత్‌కుమార్, ఎంపిలు ఎ.రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంఎల్‌సి టి.జీవన్‌రెడ్డి, ఎంఎల్ఎలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి), మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, మాజీమంత్రి మహ్మద్ షబ్బీర్‌అలీ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, ఒబిసి సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షలు సోహైల్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో నాయకులు కొద్దిసేపు రోడ్డుపైన బైఠాయించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా అరెస్ట్ చేసిన వారిని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
రైతులకు అండగా పోరాటం చేస్తాం: ఉత్తమ్
రైతులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ సహించబోదని, రైతులకు అండగా పోరాటం చేస్తుందని టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలను దండుకున్నారని విమర్శించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభత్వు మెడలు వంచైనా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. రానున్న నాగార్జున సాగర్, ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఏడేళ్ల పాలనలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యమని, విభజన చట్టాలను కూడా అమలు చేయలేకపోయిందన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి యథాస్థానానికి వెళ్తుందన్నారు.
ఆ చట్టాలను వెనక్కితీసుకోండి: భట్టి విక్రమార్క
కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
చలో రాజ్‌భవన్ ఉద్రిక్తం
RELATED ARTICLES