కొనసాగుతున్న అన్నదాతల నిరసన
న్యూఢిల్లీ: లోహ్రి సందర్భంగా బుధవారం నాడు ఆందోళన చేస్తున్న రైతులు వివాదాస్పద రైతు చట్టాల ప్రతుల్ని తగలబెట్టారు. ఒక్క సింఘు దగ్గరే లక్ష ప్రతుల్ని దహనం చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పరమ్జీత్ సింగ్ తెలిపారు. రబీ పంటకోతలకు సూచనగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోహ్రిని విస్తృతంగా జరుపుకొంటారు. చలిమంటలు వేసి, వాటిలోకి పల్లీ లు, పేలాలు లాంటి ఆహార పదార్థాలు నివేదన చేస్తారు. జానపద గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. పండగ సందర్భంగా చేసిన ఆహార పదార్థాలతో విందు చేసుకొంటారు. ప్రతుల దహనం గురించి మాట్లాడుతూ… “వేడుకల కోసం వేచి చూస్తున్నాం. కేంద్రం నల్లచట్టాలను విరమించుకున్న రోజున అన్ని పండగలను మేం జరుపుకొంటాం” అని హర్యానా కర్నాల్ జిల్లాకు చెందిన గురుప్రీత్ సింగ్ అనే రైతు అభిప్రాయం వ్యక్తంచేశారు. లోహ్రి సందర్భంగా నిరసన ప్రధాన కేంద్రాలైన ఢిల్లీ హర్యానా సరిహదుల్లో చలిమంటలు వేశారు. నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోరాటం, ఆశకు సంబంధించిన గీతాలు ఆలపిస్తూ మంటచుట్టూ ప్రదక్షిణ చేశారు. రైతు చట్టాల ప్రతుల్ని దహనం చేసి తమ ఆందోళన విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. “ఈ లోహ్రి సంఘర్షణతో కూడింది” అని అభిప్రాయపడ్డ రాజ్బీర్ సింగ్ అనే రైతు “ఈ రోజు మేం ప్రతుల్ని దహనం చేశాం. రేపు కేంద్రం చేస్తుంది. అలా జరిగేలా మేం చేస్తాం” అని విశ్వాసం వ్యక్తంచేశారు. యోగేంద్ర యాదవ్, గుర్నామ్ సింగ్ చడూనీ తదితర రైతు నాయకులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. లోహ్రి సందర్భంగా బుధవారం అన్ని నిరసన స్థలాల్లో సాగు చట్టాల ప్రతుల్ని తగలబెడతామని రైతులు ఇదివరకే ప్రకటించారు. ఆ తర్వాత 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ముందుముందు ఆచరించాల్సిన కార్యాచరణ గురించి సమావేశం జరపనుంది. ఇదీ రైతు నాయకులు తాము సుప్రీం కోర్టు నియమించిన సంఘం ముందుకు వెళ్లం అని చెప్పిన తర్వాత రోజు పరిస్థితి. కమిటీలో ఉన్నవాళ్లంతా “ప్రభుత్వ అనుకూలురు” అని, చట్టాల రద్దు తప్ప ఇంకేమీ వద్దని రైతు నాయకులు స్పష్టంచేశారు. చట్టాల మీద స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతులు స్వాగతించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సంఘంలోని సభ్యుల తటస్థత మీద మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల మీద సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. ప్రభుత్వం, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు నలుగు సభ్యుల సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే.
చర్చలే పరిష్కారం: రూపాలా
సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ దిశగా నిరసన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు కొనసాగించనున్నట్లు వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా బుధవారం పిటిఐకి వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఎనిమిది విడతల చర్చలు జరిగాయి. అయితే ప్రతిష్టంభనకు పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇక సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సభ్యులు ప్రభుత్వ అనుకూలురు అని రైతు నాయకులు పేర్కొన్నప్పటికీ, ఈ నెల 15వ తేదీన ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే చట్టాల రద్దు తప్ప ఇంకేమీ వద్దన్నది రైతుల మాట. వ్యవసాయ శాఖ మరో సహాయమంత్రి కైలాస్ చౌధరి కూడా ప్రభుత్వం చర్చలకు మొగ్గుచూపుతున్నట్లు మంగళవారం పేర్కొన్నారు. అయితే తమకేం కావాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం రైతులే అని చౌధరి స్పష్టంచేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు నవంబర్ 28 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ చట్టాలు వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలని, దళారులను తొలగించి, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను ఇస్తాయని కేంద్రం అంటోంది. అయినప్పటికీ కొత్త చట్టాలు కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థలకు గండికొడతాయని, రైతులను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని నిరసన చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు చట్టాల ప్రతులు భోగిమంటల్లో
RELATED ARTICLES