అనర్హులకు 1,364 కోట్ల రూపాయలు
ఆర్‌టిఐ దరఖాస్తుకు కేంద్ర వ్యవసాయ శాఖ జవాబు
ఇదీ పిఎం కిసాన్ పథకం తీరు
న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం 20.48 లక్షల మంది అనర్హులైన లబ్ధిదారులకు 1,364 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఒక సమాచార హక్కు (ఆర్‌టిఐ) దరఖాస్తుకు కేంద్ర వ్యవసాయ శాఖ జవాబు ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకాన్ని కేంద్రం 2019లో ప్రారంభించింది. దీనికింద రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మూడు సమాన విడతల్లో 6,000 రూపాయలు మద్దతుగా చెల్లిస్తారు. పిఎం కిసాన్ కింద “అనర్హులైన రైతులు”, “ఆదాయపు పన్ను చెల్లించే రైతులు” అనే రెండు వర్గాల అనర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ఆర్‌టిఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. ఆర్‌టిఐ కింద దరఖాస్తు చేసిన కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్‌కు చెందిన వెంకటేశ్ నాయక్ ప్రభుత్వం నుంచి సమాచారం అందుకున్నారు. “అనర్హులైన లబ్ధిదారుల్లో సగానికంటే ఎక్కువమంది (55.58%) ఆదాయపు పన్ను చెల్లించే వర్గానికి చెందుతార”ని ఆయన వెల్లడించారు. మిగిలిన 44.41% మంది అనర్హులైన రైతుల కిందికి వస్తారు. అయితే ప్రసార మాధ్యమాల వార్తల నుంచి అనర్హులైన వ్యక్తులకు బదిలీచేసిన నిధులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని నాయక్ తెలిపారు. ఆర్‌టిఐ చట్టం, 2005 కింద పొందిన సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పథకం ప్రారంభమైన 2019 నుంచి 2020 జులై 31 వరకు అనర్హులైన లబ్ధిదారులకు 1,360.13 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే “డబ్బులు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు ప్రభుత్వ సమాచారమే తెలుపుతోంది” అని నాయక్ అన్నారు. ఇక ఇలాంటి రైతుల్లో ఎక్కువమంది పంజాబ్, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలకు చెందినవాళ్లే ఉన్నారు. పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్న అనర్హులైన రైతుల్లో 54.03% ఈ అయిదు రాష్ట్రాల వాళ్లే. సిక్కింలో మాత్రం అతి తక్కువగా కేవలం ఒకే ఒక్క అనర్హుడైన లబ్ధిదారుడు ఉన్నాడని నాయక్ తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు… నాలుగు నెలల వ్యవధిలో 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ జరుగుతుంది. అధిక ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించదు. పిఎం కిసాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో 2019 ఫిబ్రవరి 24 నాడు ప్రారంభించారు.
కిసాన్ పథకం దారితప్పింది!
RELATED ARTICLES