పడిపోయిన చికెన్ అమ్మకాలు
భయపెడుతున్న బర్డ్‌ఫ్లూ!
తెలంగాణాలో ఫ్లూ లేదన్న మంత్రులు ఈటల, తలసాని
ప్రజాపక్షం/హైదరాబాద్ దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో చికెన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా చికెన్ వినియోగించే హైదరాబాద్ నగరంలో ఆదివారం అమ్మకాలు సగానికిపైగా పడిపోయాయి. దీంతో కోడిమాంసం ధరలు పడిపోయాయి. లైవ్ కిలో ధర రూ.105, డ్రెస్డ్ నగరంలో వివిధ ప్రాంతాల్లో రూ.140 నుంచి రూ.180 వరకు ధరలు పడిపోయాయి. బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. కానీ చాలా మంది మాంసం ప్రియులు ఎందుకైనా మంచిదని చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్ నగరంలో రోజుకు 6లక్షల కిలోల చికెన్ వినియోగం అవుతుందనే అంచనాలు ఉంన్నాయి. అలాగే పండగలు, ఆదివారం రోజుల్లో అయితే దాదాపు 8లక్షల కిలోల వరకూ ఉంటుందని వ్యాపారులు చెప్పుతున్నారు. కానీ బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ కొనే వారి సంఖ్య తగ్గుతోంది. అమ్మకాలు పడిపోతున్నాయన్న ఆందోళనలలో వ్యాపారులు చికెన్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కొనుగోలు చేసేందుకు అధికశాతం మంది భయపడుతున్నారు. హైదరాబాద్ నగరానికి పక్క రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో కోళ్లను దిగుమతి చేస్తుంటారు. దీంతో హైదరాబాద్ వాసుల్లో తెలియని భయం నెలకొంది. ఇప్పటికే మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపధ్యంలో వెజ్‌వైపు అధికశాతం మంది మొగ్గుచూపుతున్నారు. కానీ ఇప్పుడు బర్డ్‌ఫ్లూ భయం చికెన్ ప్రియులకు ఆశనిపాతం మారింది. మటన్ కొనాలంటే అధక ధర చెల్లించాలి. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తాజాగా చేపల ధరలను కూడా పెంచి అమ్ముతున్నారు. ఆదివారం చేపల ధరలు 100 నుంచి 200 రూపాయలు పెంచి అమ్మకాలు చేశారు. ఇక మటన్ ధర కిలో రూ.700 రూపాయలకు అమ్ముతున్నా, వాటి శరీరంలోని మిగిలిన భాగాలు లివర్, బోటీ, కాళ్లు, తలకాయ వంటి వాటిని మాత్రం అధిక ధరలకు అమ్మకాలు చేశారు. ప్రభుత్వం బర్డ్‌ఫ్లూ విషయంలో అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్న ప్రజల్లో మాత్రం ఆందోళన తొలగడం లేదు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపధ్యంలో తెలంగాణలో మాత్రం అమ్మకాల పై ప్రభావం చూపిస్తోంది. బర్డ్‌ఫ్లూ ఫౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఫౌల్ట్రీ పరిశ్రమ యజమానులు బర్డ్‌ఫ్లూపై తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన వారు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయనే ఆవేదన వ్యక్తం అవుతోంది.
పౌల్ట్రీ పతనం
RELATED ARTICLES