ధ్రువీకరించిన ఏడు రాష్ట్రాలు
మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
భారీగా పతనమైన చికెన్ ధరలు
న్యూఢిల్లీ: కేరళలోని బర్డ్ ఫ్లూ ప్రభావిత రెండు జిల్లాల్లో పక్షుల మూకుమ్మడి వధ పూర్తయింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో పక్షులు, ఢిల్లీలోని సంజయ్ సరస్సు ప్రాంతంలో బాతులు అసాధారణంగా మరణించినట్లు సమాచారం. దాంతో దేశంలో బర్డ్ ఫ్లూ గురించి కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు ఒక స్టేటస్ రిపోర్టును విడుదల చేసింది. ఏడు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూను ధ్రువీకరించాయని అందులో పేర్కొన్నారు. హర్యానాలోని పంచ్‌కులా జిల్లాలో కోళ్లలో, మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి, రాజ్‌గఢ్, షాజాపుర్, అగర్, విదిశ జిల్లాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్ జంతు ప్రదర్శనశాల, రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్, దౌసా జిల్లాల్లో వలస పక్షుల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాజిటివ్ కేసులను ధ్రువీకరించారు. అందుకని ప్రభావిత రాష్ట్రాలు వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సలహా ఇచ్చింది. ఇప్పటివరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచలప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ 7 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిందని మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
తగ్గిన చికెన్ ధరలు
ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో కోళ్లు, అడవి పక్షులు జనవరి 8 రాత్రి, 9వ తేదీ పొద్దున అసాధారణంగా మరణించినట్లు సమాచారం. దాంతో ఆ రాష్ట్రం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. సేకరించిన నమూనాలను ఐసిఎఆర్ ఎన్ఐహెచ్ఎస్ఎడి ప్రయోగశాలకు పంపించింది. ఢిల్లీలోని సంజయ్ సరస్సు ప్రాంతంలో కూడా బాతులు అనుమానాస్పదంగా మృతిచెందాయి. వీటి నమూనాలను, ఇంకా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా చనిపోయిన కాకుల నమూనాలను ఐసిఎఆర్ ఎన్ఐహెచ్ఎస్ఎడికి పంపించారు. ఇదిలా ఉంటే కేరళలో బర్డ్ ఫ్లూ ప్రభావిత రెండు జిల్లాల్లో పక్షుల మూకుమ్మడి వధ పూర్తయింది. ఆ తర్వాత కేరళ చేపట్టాల్సిన చర్యల గురించి కూడా మార్గదర్శకాలు జారీచేశారు. కేరళ, హర్యానా, హిమాచలప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ విభాగాలకు పరిస్థితి మీద నిఘా ఉంచాలని, మనుషులకు వ్యాధి సంక్రమించకుండా చూడాలని సూచించారు. జలాశయాల చుట్టూ, పక్షుల మార్కెట్లు, జూలు, కోళ్ల ఫారంలు తదితరాల దగ్గర నిఘా పెంచడంతోపాటు పక్షుల కళేబరాలను జాగ్రత్తగా పూడ్చడం, పౌల్ట్రీ ఫారమ్‌ల దగ్గర బయో సెక్యూరిటీ చర్యలు చేపట్టడం లాంటివి చేయాలని సూచించారు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎలాంటి పరిస్థిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ రాష్ట్రాలకు విజ్ఞప్తిచేసింది. ఇక బర్డ్ ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పతనమవడం గమనార్హం.
భయపెడుతున్న బర్డ్‌ఫ్లూ
RELATED ARTICLES