హాజరైన మంత్రి కె.టి.రామారావు
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ, కుమ్ర ఈశ్వరీబాయి, సూదం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు బాధత్యలు చేపట్టారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని బుద్ధభవన్ కమిషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి, మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డితో పాటు మిగిలిన సభ్యులకు కెటిఆర్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ 2018 జులై నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మెదక్ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డిని ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రిపురాన వెంకటరత్నంను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించడంతో 2018 జులై వరకు ఆమె బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మహిళా కమిషన్ లేకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.
సునీతా లక్ష్మారెడ్డి నేపథ్యం…
సునీత భర్త లక్ష్మారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా గోమారం సర్పంచ్‌తో పాటు శివ్వంపేట జెడ్‌పిటిసి సభ్యుడిగా పనిచేశారు. మెదక్ జిల్లా రైతు సంక్షేమం సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సునీత మామ రామచంద్రారెడ్డి 25 ఏళ్లపాటు సర్పంచ్‌గా, శివ్వంపేటకు ఎంపిపిగా పనిచేశారు. వీరి వారసురాలిగా సునీత 1999లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999లో తొలి ప్రయత్నంలోనే ఎంఎల్‌ఎగా గెలుపొందారు. అదే నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల హయంలో ఆమే పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సునీత టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
24 గంటలు మహిళలకు అందుబాటులో ఉంటా: సునీత లక్ష్మా రెడ్డి
ఇకపై మహిళలు ఎలాంటి వేధింపులకు గురి కాకుండా చూసుకుంటామని మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ మాదిరిగా ఫ్రెండ్లీ మహిళా కమిషన్‌ను చూడబోతున్నారని అన్నారు. 24 గంటలు మహిళలకు అందుబాటులో ఉంటామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌తో కలిసి పనిచేస్తామన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉన్న డయల్ 118కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సునితా లక్ష్మారెడ్డి అన్నారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ
RELATED ARTICLES