డ్రామాలొద్దు.. ఏదో ఒకటి చెప్పండి
చట్టాల రద్దుపై కేంద్రాన్ని నిలదీసిన రైతులు
అసంపూర్ణంగా ముగిసిన ఐదో విడత చర్చలు
చర్చలు 9కి వాయిదా.. రైతుల మౌనదీక్ష
రైతు కమిషన్ ఏర్పాటుకు అన్నదాతల డిమాండ్
సవరణలు తెస్తామన్న కేంద్ర ప్రతిపాదనకు తిరస్కృతి
న్యూఢిల్లీ: డిసెంబర్ 9 నాడు మరో విడత చర్చలు జరుపుతామని రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని “అవును లేదా కాదు” రూపంలో స్పష్టం చేయాలని రైతు నాయకులు మౌనవ్రతానికి దిగడంతో ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులతో చర్చలు దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగాయి. డిసెంబర్ 9 వరకు ప్రభుత్వంలో అంతర్గతంగా మరిన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత రైతు సంఘాల ముందు బలమైన ప్రతిపాదన ఉంచాలని ప్రభుత్వం భావించిందని సమాచారం. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రైతుల ఆందోళనలను పరిశీలిస్తామని ప్రభుత్వం శనివారం చర్చల్లో రైతు సంఘాల ప్రతినిధులతో చెప్పింది. కానీ రైతు నాయకులు మాత్రం చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు అంటిపెట్టుకునే ఉన్నారు. డిమాండ్లకుఅంగీకరించకపోతే చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైన చర్చలను కొనసాగిస్తామని ప్రభుత్వం రైతు నాయకులను సమాధానపరిచింది. కొత్త చట్టాలు మండీ విధానం, కనీస మద్దతు ధరలను చెల్లిపోయేలా చేస్తాయని, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని ఢిల్లీ సరిహద్దు స్థలాల్లో వేలాది రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. టీ విరామం తర్వాత సాయంత్రం సమావేశం కొనసాగింది. అయితే ఈ మధ్యలో రైతు నాయకులు గురువారం లానే తాము తెచ్చుకున్న ఆహారం తినడం, నీళ్లు తాగడం, తేనీరు సేవించడం విశేషం. చర్చలు జరపాలని రైతు నాయకులకు సర్దిచెప్పడంతో మంత్రులు ప్రతిపాదించిన వివిధ అంశాల గురించి వారిమధ్య కొంత విభజన కనిపించినట్లు సమాచారం. పంటల వ్యర్థాల దహనం విషయంలో, కొంతమంది రైతు కార్యకర్తల మీద దాఖలైన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినట్లు కూడా సమాచారం. సాయంత్రానికి 40 మంది రైతు సంఘాల ప్రతినిధులలో ముగ్గురు నలుగురు సభ్యులు ఉన్న బృందాలతో మంత్రులు చర్చలు జరిపారు. సమావేశానికి ముందు ప్రభుత్వం సుహృద్భావపూర్వకమైన చర్చలకు కట్టుబడి ఉందని, కొత్త వ్యవసాయ చట్టాల మీద అన్నిరకాలైన సానుకూల ఫీడ్‌బ్యాక్‌ను ప్రభుత్వం స్వాగతిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలతో వెల్లడించారు. ఇంకా తాము రైతులతో శాంతియుత చర్చలకు కట్టుబడి ఉన్నామని, రైతుల భావోద్వేగాలను దెబ్బతీయమని ఆయన అన్నారు. చర్చల సమయంలో నిరసన స్థలాల నుంచి పెద్దలు, మహిళలు, పిల్లలను ఇళ్లకు పంపించాలని తోమర్ రైతు నాయకులకు విజ్ఞప్తి చేశారు. పంజాబ్ భావోద్వేగాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుదని రైతు నాయకులను ఉద్దేశించి వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ అన్నారు. ఆయన పంజాబ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చర్చల్లో ప్రభుత్వం తరఫున రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. సమస్య పరిష్కారం గురించి, కొత్త చట్టాల కింద ప్రతిపాదించిన ప్రైవేటు మండీల్లో వ్యాపారులు నమోదు చేసుకునే విషయంలో వివాదాస్పద అంశాల గురించి రెండు వర్గాలు చర్చించినట్లుగా భావిస్తున్నారు. సమావేశానికి ముందు చర్చించే విషయాలను వెల్లడించేందుకు కేంద్ర మంత్రులు తోమర్, గోయల్, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రైతు సంఘాల నాయకులు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గకపోవడంతో గురువారం నాటి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇక ఈ నెల 8న ‘భారత్ బంద్’ నిర్వహిస్తామని, ఆందోళన ఉధృతం చేసి, ఢిల్లీకి వెళ్లే మరిన్ని మార్గాలను అడ్డుకుంటామని రైతులు శుక్రవారం నాడు ప్రకటించారు.
చట్టాలు రద్దుచేస్తేనే నిరసనలు ఆగుతాయి
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలిని లెక్కచేయకుండా రైతులు నవంబర్ 26 నుంచి నిరసన చేస్తున్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలకు ముందే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోనే ప్రతిష్టంభన సమసిపోతుందని, మేం దేనికీ లొంగిపోము, మా ప్రతిపాదనలను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, ప్రస్తావించిన అంశాల గురించి చర్చించేందుకు ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, చట్టాలను విరమించుకోవడానికి తక్కువగా మరి దేనికీ మేము అంగీకరించమని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) ఆర్థిక కార్యదర్శి క్రిష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో రైతులకు రవాణా సంఘాలు, చిల్లర వ్యాపారుల లాంటివాళ్లు సంఘీభావం ప్రకటించారని ఆయన అన్నారు. ఈ చట్టాల ద్వారా సాగులో విదేశీ జోక్యాన్ని అనుమతించినట్లయిందని, వ్యవసాయాన్ని కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి వదిలిపెట్టారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిరసనకారుల మీద ఢిల్లీ పోలీసులను ఉపయోగించడం పిరికి చర్య అనీ, దేశవ్యాప్తంగా రైతుల మీద నమోదు చేసిన కేసులను బేషరతుగా విరమించుకోవాలని క్రిష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వం, రైతులకు మధ్య అయిదో విడత చర్చలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మూడు చట్టాలనూ వెనక్కి తీసుకోవాలన్నదే మా డిమాండ్ అనీ, కనీస మద్దతు ధరకు చట్టం ద్వారా హామీ ఇవ్వాలని భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఓంకార్ సింగ్ అగౌల్ అన్నారు. ఇంకా విద్యుత్ సవరణ బిల్లు, పంటల వ్యర్థాల దహనం మీద చేసిన అత్యవసర ఆదేశాన్ని రద్దు చేయాలని కూడా ఆయన కోరారు. ఇక సమావేశ స్థలానికి బయట ‘మేం రైతులు మద్దతిస్తున్నాం’ అన్న బ్యానర్లను పట్టుకొని ఇండియన్ టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ (ఐటిటిఎ) ఉద్యోగులు రైతులకు సంఘీభావం ప్రకటించారు. నిరసన చేస్తున్న రైతులకు వాహనాలను ఐటిటిఎనే సరఫరా చేసింది.
మంత్రివర్గ జోక్యాన్ని కోరిన యుకె ఎంపీలు
యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులోని 36 మంది సభ్యులు పార్టీలకు అతీతంగా భారత్‌లో రైతుల నిరసనల వల్ల, బ్రిటన్‌లో ఉన్న పంజాబీల మీద పడిన ప్రభావాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో తెలియజేయాలని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను అడిగారు. ఈ లేఖను బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపి తన్మన్జీత్ సింగ్ ఢేసి రూపొందించగా, భారతీయ మూలాలు కలిగిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, వాలేరీ వాజ్తోపాటు, మాజీ లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్ సంతకాలు చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్‌ను (ఎఫ్‌సిడిఒ) యుకె ఎంపీలు కోరారు. అయితే నిరసనల పట్ల విదేశాల నాయకుల వ్యాఖ్యాలు “అసంపూర్ణమైనవి”, “అనసవరమైనవి” అని, ఇది ఒక ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారం అని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రజలకు హక్కు ఉందని, అధికారులు వారికి ఆ అవకాశం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పోక్స్ పర్సన్ అయిన స్టెఫానే డుజారిక్ అన్నారు.
అవునా? కాదా?
RELATED ARTICLES