న్యూఢిల్లీ: మే నుంచి చైనాతో సరిహద్దు వివాదంతో సతమతమవుతున్న సమయంలో భారత్ అమెరికా దేశాల మధ్య 2+2 మంత్రుల స్థాయి సమావేశాలు జరిగాయి. రెండు రోజులు జరిగిన ఈ సమావేశాల్లో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. అమెరికా నుంచి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపెయో, రక్షణ కార్యదర్శి మార్క్ టి ఎస్పర్ చర్చలు జరిపారు. వీరికి రెండు దేశాలకు చెందిన అత్యున్నత సైనిక, భద్రత అధికారులు సహకారం అందించారు. రెండు దేశాల సైన్యం మధ్య ఇప్పటికే సన్నిహితంగా ఉన్న సంబంధాలను మరింత విస్తరించే అంశం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాలకు పరస్పరం ఆసక్తి ఉన్న సరిహద్దు అంశాల గురించి ఇందులో చర్చించారు. ఇంకా అత్యున్నత సైనిక సాంకేతికత, వర్గీకరించిన ఉపగ్రహ సమాచారం, రెండు దేశాల మధ్య కీలకమైన సమాచారం మార్పిడి గురించి చరిత్రాత్మక భద్రతా ఒప్పందం ‘బేసిక్ ఎక్సేంజి అండ్ కోఆపరేషన్ అగ్రీమెంట్’ (బిఇసిఎ) మీద మంగళవారం నాడు సంతకాలు చేశారు. దీంతో 2002 నాటి సైనిక సమాచారం మీద సాధారణ భద్రత (జిఎస్‌ఒఎంఐఎ), 2016 లో అమెరికా తన సన్నిహిత భాగస్వాములకు ఇచ్చే ‘మేజర్ డిఫెన్స్ పార్టర్’గా భారత్‌కు గుర్తింపును ఇచ్చే ఒప్పందం, అదే ఏడాది రెండు దేశాలు సైనిక అవసరాల కోసం ఒకరి స్థావరాలు మరొకరు వాడుకోవడానికి సంబంధించిన లాజిస్టిక్స్ ఎక్సేంజి మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్ (ఎల్‌ఇఎంఒఎ) ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2018లో అమెరికా నుంచి భారత్‌కు అత్యున్నత సాంకేతికత అమ్మేందుకు సంబంధించి కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రీమెంట్ (సిఓఎంసిఎఎస్‌ఎ) పేరుతో మరో ఒప్పం దం కుదిరింది. అయితే బెకాతో ఈ నాలుగు ఒప్పందాలూ పూర్తిగా ఖరారు అయిపోయాయి. భారత్ అమెరికా మధ్య 2+2 చర్చల మొదటి భేటీ ఢిల్లీలో 2018 సెప్టెంబర్‌లో, రెండోది గతేడాది డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరిగాయి. మూడోదైన ప్రస్తుత సమావేశంలో నలుగురు మం త్రులూ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీలకమైన అంశాల మీద సమగ్రమైన చర్చ జరిపామని, అమెరికాతో బెకా ఒప్పం దం చేసుకోవడం ‘చెప్పుకోదగ్గ ముందడుగు‘ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల కోసం తాము కట్టుబడి ఉన్నట్లు రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. తమ సార్వభౌమత్వం, స్వేచ్ఛకు ఏర్పడే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తాము భారత ప్రజలకు మద్దతిస్తామని పాంపెయో వెల్లడించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, పారదర్శకతకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ శత్రువని ఆయన విమర్శించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక, రక్షణ సహకారం వికసించడం కొనసాగుతూనే ఉంటుందని మరో కార్యదర్శి ఎస్పర్ అన్నారు.
అమెరికాతో మరింత ‘అనుబంధం’ బిగిసిన బెకా ఒప్పందం

RELATED ARTICLES