నీట మునిగిన బస్తీలు, పల్లెలు
తుడిచిపెట్టుకుపోయిన పంటలు
లక్షలాది ఎకరాలు విధ్వంసం
కొట్టుకుపోయిన రోడ్లు
చెరువులు, కాల్వలకు గండ్లు
రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం
వర్షాలకు 13 మంది మృత్యువాత
మందకొండిగా సహాయక చర్యలు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్టంలో జలవిలయం బీభత్సాన్ని సృష్టించింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. సుమారు 13 మంది వరకు మృత్యువాత పడ్డారు. వారిలో తొమ్మిది మంది ఇల్లు కూలిన కారణంగా సజీవసమాధి అయ్యారు. మేఘాలు ఊడిపడ్డ తీరు ఈ కాలంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. గత రెండు రోజులుగా కురిసిన వానలకు పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్ ఈ స్థాయిలో వర్షాలు కురువడం గత వందేళ్లలో ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. అయితే బుధవారం ఉదయం 8.30 నిమిషాలకు నగరంలో వర్షం నిలిచిపోయింది. ఆ సమయానికి నగరంలో గత 24 గంటల్లో సుమారు 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు ఐఎండి వెల్లడించింది. ప్రస్తుతం వాయుగుండం తెలంగాణ దాటి కర్నాటకలోని గుల్‌బర్గా దిశగా వెళ్తోంది. డిప్రెషన్ వేగంగా మహారాష్ట్ర దిశకు పయనిస్తున్నట్లు ఐఎండి అంచనా వేస్తున్నది. రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. దీని వల్ల మధ్య మహారాష్ట్ర, కొంకన్, గోవా, కర్నాటక, తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నట్లు ఐఎండి అంచనాగా ఉంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా ఘట్‌కేసర్, సింగపూర్ టౌన్‌షిప్‌లో 32.3 సెం.మీ,హయత్‌నగర్‌లో 29.8, హస్తినాపురంలో 28.4 సెం.మీ, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 26.6, ఇబ్రహీంపట్నంలో 25.7 సెం.మీ, సరూర్‌నగర్‌లో 27.35, ఉప్పల్‌లో 25.6 సెం.మీ, ముషీరాబాద్‌లో 25.6 సెం.మీ, బండ్లగూడలో 23.9 సెం.మీ వర్షపాతం, మేడిపల్లిలో 24.2 సెం.మీ, బాలానగర్‌లో 23.1 సెం.మీ, సికింద్రాబాద్‌లో 23.2 సెం.మీ, మల్కాజిగిరిలో 22.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం, యాదాద్రి భువనగిరి, పూర్వ వరంగల్, పూర్వ మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. అతివృష్టి రైతన్నను తీవ్రంగా కుంగదీసింది. మొత్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క వరి మినహా మిగతా పంటలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పతి మొక్కలను పూర్తిగా పీకేయాల్సిన పరిస్థితి దాపురించింది. మిరప వంటి పంటలు కొట్టుకుపోయాయి.
జిహెచ్‌ఎంసి వైఫల్యం
వరదల్లో చిక్కుకున్న బాధితులను సకాలంలో ఆదుకోవడంలో వివిధ ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయి. మంగళవారం సయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు కొన్ని విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయలేకపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ విధంగా వరద ప్రవహించింది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో జిహెచ్‌ఎంసి యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముషీరాబాద్‌లోని నాగమయ్యకుంట, పద్మకాలనీ, అంజయ్య బస్తీ, కావడిగూడ సబర్‌మతి నగర్, అరుధతి నగర్‌లలో వరద నీరు మోకాలి లోతు పైగా నీరు వచ్చిచేరింది. అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఎల్.బి.నగర్, సరూర్‌నగర్, పాతబస్తీ హుస్సేని ఆలం, నదీంకాలనీ, ఖైరతాబాద్‌లలో పలు కాలనీలు, బస్తీలలో ఇళ్లలో వరదనీరు వచ్చింది. నదీం కాలనీ పూర్తిగా అంటే ఒక అంతస్తు ఎత్తు వరకు వరదనీరు పోటేత్తింది. భవనాలపై, ఇతర ప్రాంతాలకు ముంపు బాధితులు తరలివెళ్లారు. ఈదురుగాలులకు నగరంలో చాలా చోట్ల భారీ వృక్షాలు, చెట్లు కూలిపోయాయి. కూలిపోయిన చేట్లను సకాలంలో తొలగించకపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. వరదల దాటికి కొత్తగా వేసిన రోడ్లు కూడా గుంటలు పడ్దాయి. నగరంలో ఉన్న చెరువులు కబ్జాకు గురికావడంతో కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటిలో సుమారు 10 మంది గల్లంతయినట్లు సమాచారం. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి అధికారులు, ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైనా నాళాల విషయంలో, వరద నీరు రోడ్డుమీదకు రాకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం అతి భారీ వర్షాలు పడడం వల్ల హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. మూసీ నదితోపాటు, పలు చోట్ల నాలాలు పొంగి పొర్లాయి. నగరంలో చోటుచేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు చోట్ల వాహనాలను దారి మళ్లించగా.. మరికొన్ని ప్రాంతాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్ – చైతన్యపురి మధ్య మోకాలిలోతు నీరు ప్రవహిస్తుండటంతో పూర్తిగా వాహన రాకపోకలను నిలిపివేశారు.
* హైదరాబాద్ మహానగరంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలో వర్షం పరిస్థితులు…
* హైదరాబాద్ వనస్థలిపురం హరిహరపురం కాలనీ జలమయయైంది. జలదిగ్బంధంలో 300 మంది చిక్కుకున్నారు.
* కూకట్‌పలివ్ల భాగ్యనగర్ కాలనీలో భారీ వృక్షం కూలిపోవడంతో కారు ధ్వంసమైంది.
* ఖైరతాబాద్, చింతల్ బస్తీలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. గాంధీనగర్, మారుతీనగర్‌లో భారీగా వరద నీరు నిలిచిపోయింది.
* ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చర్లపల్లి నాగారం సరిహద్దు నాలాపలు ఇళ్లలోకి చేరిన నాలా నీరుబ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
* దిల్‌సుఖ్‌నగర్ నుంచి కోఠి వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లోని పలు బస్తీల్లోకి వరద నీరు చేరింది.
* వర్షాల వల్ల నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
* జిఎచ్‌ఎంసి పరిధిలో 3 రోజులు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
* అత్యవసర సేవల కోసం నెంబర్‌లలో 040-2111 11111 సంప్రదించాలని, జిహెచ్‌ఎంసి విపత్తు నిర్వహణశాఖ నెంబరు : 90001 13667, జిహెచ్‌ఎంసి పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది నెంబరు : 63090 62583, జిహెచ్‌ఎంసి విద్యుత్ శాఖ నెంబరు: 94408 13750, ఎన్‌డిఆర్‌ఎఫ్ నెంబర్ 83330 68536, డిఆర్‌ఎఫ్ నెంబర్ 040 2955 5500 జిహెచ్‌ఎంసి విపత్తు నిర్వహణశాఖ నెంబర్‌లలో 97046 01866 సంప్రందించాలని అధికారులు సూచించారు.