ప్రజాపక్షం/న్యూఢిల్లీ : సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు అన్నీ రాజాతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ, ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల తీరు పట్ల సిపిఐ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం గురువారంనాడొక ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య ఢిల్లీ అలర్లపై విచారణ చేస్తున్న పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఈ అల్లర్లల 53 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. సిఎఎకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా, ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు తెలియజేశారని, ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. పోలీసులను అడ్డంపెట్టుకొని బిజెపి కొత్తగా కుట్రలు పన్నుతున్నదని తాజా వేధింపులు చూస్తే అర్ధమవుతోందని సిపిఐ విమర్శించింది. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తిన రాజకీయనాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని పేర్కొంది. ఎన్ఎఫ్ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి అన్నీరాజాతోపాటు వివిధ రాజకీయ
పార్టీలకు చెందిన నేతలు సల్మాన్ ఖుర్షీద్, బృందాకారత్, కవితా కృష్ణన్, హక్కుల కార్యకర్తలు ప్రశాంత్‌భూషణ్, అంజలీ భరద్వాజ్, యోగేంద్రయాదవ్, హర్ష్ మందర్, రాహుల్‌రాయ్, అపూర్వానంద్, సబా దావన్ వంటి వారిపై ఢిల్లీపోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై కూడా పోలీసులు ఆరోపణలు చేశారు. వీరంతా ముస్లిం మహిళలు చేస్తున్న శాంతియుత నిరసనకు సంఘీభావం మాత్రమే తెలిపారని, కానీ ఒక పెద్ద కుట్రగా ఢిల్లీ పోలీసులు దీన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని సిపిఐ విమర్శించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బిజెపి నాయకులను విస్మరించడం విచిత్రంగా వుందని వ్యాఖ్యానించింది. దర్యాప్తులో ఇంత వివక్ష చూపడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. ఈ విషయంపై సిట్టింగ్, లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని ఇప్పటికే రాష్ట్రపతిని కోరినట్లు తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నోరువిప్పిన వారిని నేరస్తులుగా చూస్తూ, కొత్త కుట్రకోణాన్ని పరిచయం చేస్తున్న ఢిల్లీ పోలీసులు తమ వైఖరిని తక్షణమే మానుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది.
వ్యవసాయ బిల్లులకు పక్కా వ్యతిరేకం ః బినయ్ విశ్వం
పార్లమెంటులో ఇటీవల వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా సిపిఐ వీటికి మద్దతు తెలిపిందని వచ్చిన తప్పుడు భాష్యాలను సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, పార్టీ ఎంపీ బినయ్ విశ్వం తీవ్రంగా ఖండించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న క్రూరచట్టాలకు సిపిఐ మద్దతు తెలుపుతుందని దేశంలో ఏ ఒక్కరైనా కలలోనైనా ఊహించుకోగలరా అని ప్రశ్నించారు. పార్టీ అనుభవంలో ఇలాంటి కుట్ర కోణాలను చాలా చూశామని, తప్పుడు భాష్యాలను కట్టిపెట్టి, ఈ వ్యవసాయ బిల్లులను తక్షణమే ఉపసంహరించాలని విశ్వం డిమాండ్ చేశారు. ఈ వ్యవసాయ బిల్లులతోపాటు తాజాగా ఆమోదించిన మూడు కార్మిక బిల్లులను కూడా సిపిఐ పక్కాగా వ్యతిరేకిస్తున్నదని, వాటికి వ్యతిరేకంగా తమ ఆందోళనను కూడా ఉధృతం చేస్తుందని ప్రకటించారు. అంతేగాకుండా, 25న రైతుసంఘాలు చేపట్టిన భారత్‌బంద్‌కు నూటికినూరు శాతం సిపిఐ సంఘీభావం చెప్పిందని తెలిపారు.
ఢిల్లీ పోలీసుల తీరు విచారకరం : సిపిఐ
RELATED ARTICLES