వ్యవసాయ బిల్లుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మౌన నిరసన ప్రదర్శన
మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
‘రైతులను రక్షించండి, కార్మికులను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
సాయంత్రం రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష బృందం
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందడానికి వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో వివిధ ప్రతిపక్ష పార్టీలు మౌన నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ‘రైతులను రక్షించండి, కార్మికులను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ ఎంపిలు ప్లకార్డులను చేబూని నిరసన తెలిపారు. అదే విధంగా మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఎంపింలదరూ ఒకే వరుసలో నిలబడి తమ నిరసనను తెలియజేశారు. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్, తృణమూల్, సిపిఐ, సిపిఎం, డిఎంకె, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్‌వాది పార్టీ, ఎన్‌సిపి సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు సహా ఏకాభిప్రాయంగల పార్టీల సభ్యు లు కూడా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారని, రైతు వ్యతిరేక,కార్మిక వ్యతిరేక బిల్లులపై పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో రబ్బర్ స్టాంప్ వేసిందని మండిపడుతూ రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. కాగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తుదపరి కార్యాచరణను రూపొందించేందుకు బుధవారం ఉదయం ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ చాంబర్లో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడంపై వివిధ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఉభయసభల సమావేశాలను కూడా బహిష్కకరించారు. విభజన ఓటింగ్ పెట్టకుండా ఆమోదించిన ప్రతిపాదిత చట్టాలపై సంతకం చేయవద్దని వారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం నేపథ్యంలో పెద్దల సభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళానికి కారణమైన ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించడాన్ని నిరసిస్తూ ఉభయ సభల సమావేశాలను కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
వ్యవసాయ బిల్లులను తిప్పిపంపండి
వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదం పొందాయని, వాటిని తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రతిపక్ష పార్టీలు కోరాయి. బిల్లులను ఆమోదిస్తూ సంతకం చేయొద్దని విజ్ఞప్తి చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని విపక్ష సభ్యుల బృందం రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేసింది. బిల్లుల ఆమోదానికి ముందు అన్ని పార్టీలు, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చించాల్సిందని ఆజాద్ అన్నారు. ‘వ్యవసాయ బిల్లులు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం అన్ని పార్టీలు, రైతు నేతలతో చర్చించాల్సి ఉండేది. డివిజన్ ఆఫ్ ఓట్స్, మూజువాణి ఓటూ లేదు. ప్రజాస్వామ్య దేవాలయంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ఇదే విషయాన్ని మేము రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. ఈ బిల్లులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని ఆజాద్ డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనల నడుమ రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు- 2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020ను పార్లమెంటు ఆమోదించింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం సమయంలో ఎనిమిది మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని… వారిపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ చర్యను ఖండించిన విపక్షాలు పార్లమెంటు సమావేశాలను మంగళవారం బహిష్కరించాయి.
అన్నదాతను ఆదుకోండి
RELATED ARTICLES