నల్లగొండ-వరంగల్-ఖమ్మం సీటుపైనే పోటీ ఎక్కువ
సిద్ధపడుతున్న కోదండరామ్, చెరుకు సుధాకర్
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న జిట్టా, రాణిరుద్రమ
ప్రజాపక్షం/హైదరాబాద్
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల్లో పోటీకి పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి నుండే ఏర్పాట్లు ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్- నియోజకర్గం, వరంగల్– నియోజకర్గాల నుంచి పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ — నల్లగొండ — ఖమ్మం నియోజకర్గం నుంచే తెలంగాణ ఉద్యమకారుల పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, తెలంగాణ ఉద్యమంలో పిడియాక్ట్ కింద జైలుకు వెళ్లిన తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. టిజెఎస్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారి కోదండరామ్ ప్రత్యక్ష ఎన్నికలకు పట్టభద్రుల ఎంఎల్‌సి నియెజకవర్గాన్ని వేదికగా చేసుకోనున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎన్నికల కసరత్తును మొదలు పెట్టినట్టు తెలిసింది. పైగా ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడా టిజెఎస్ కోరుతోంది. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలను కలిసినట్టు సమాచారం. డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా మొదటిసారి ప్రత్యక్షంగా పోటీకి సిద్ధపడుతున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో యువజన జెఎసి నేతగా ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై పలు టీవి చర్చలు పెట్టిన టివి యాంకర్ రాణిరుద్రమ యువ తెలంగాణ పార్టీ తరపున పోటీకి సిద్ధపడుతున్నారు. గతంలో రాణి రుద్రమ కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. భువనగిరి అసెంబ్లీ నియోజవర్గం నుంచి 2014, 2018లో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమ ఇద్దరూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు కొంతకాలంగా టిఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ హైదరాబాద్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది వరకే ఆయన తన నిరసన గళాన్ని వినిపించారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని వ్యాఖ్యానించారు. అయితే హైదరాబాద్ పట్టభద్రుల నియోజకర్గం నుంచి టిఆర్ఎస్ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే పోటీచేస్తారా? లేదా గులాబీకి గుడ్‌బై చెబుతారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. అయితే తాను పార్టీ మారబోనని ఆయన చెబుతున్నప్పటికీ సమయాన్ని బట్టి స్వామిగౌడ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షునిగా అశ్వద్థామరెడ్డి కూడా హైదరాబాద్ పట్టభద్రుల ఎంఎల్‌సి నుంచి పోటీ చేసే విషయమై ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే గతంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరోసారి బరిలో ఉంటారని కూడా వినవస్తోంది.
‘పట్టభద్రుల ఎంఎల్‌సి’ బరిలో తెలంగాణ ఉద్యమకారులు
RELATED ARTICLES