HomeNewsBreaking Newsమెట్రోకు గ్రీన్‌సిగ్నల్‌

మెట్రోకు గ్రీన్‌సిగ్నల్‌

అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల
7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
స్కూల్స్‌, మాల్స్‌, పూల్స్‌, హాల్స్‌ మరో నెలరోజులు బంద్‌
కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను నెల రోజుల తర్వాత పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతానికి సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. ఐదుమాసాల క్రితం కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 పేరుతో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ నూటికి నూరు శాతం కఠినంగా అమలు చేయాలని, ఈ బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారీగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై ప్రస్తుతానికి నిషేధం కొనసాగించాలని నిర్ణయించింది. అయితే మరో 20 రోజుల తర్వాత దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు అనుమతినిచ్చిన విషయం తెల్సిందే. కాకపోతే సెప్టెంబరు 21 నుంచి ఓపెన్‌ థియేటర్లకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఇంకా వాటిని అమలు చేస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించడం లేదని, అందువల్ల యథావిధిగా మాస్క్‌, శానిటైజర్‌, భౌతికదూరం, ఇంట్లోనే వుండటం వంటి అంశాలపై ప్రజలు శ్రద్ధపెట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలివే…

  • సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
  • సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌
  • సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు
  • సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌
  • 100 మందికి మించకుండా స్పోర్ట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి
  • సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరి
  • సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి
  • అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు నిబంధనల తొలగింపు
  • అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
  • చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని కోరిన కేంద్రం
  • అత్యవసరమైతేనే బయటకు రావాలని వినతి
DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments