HomeNewsLatest Newsబిజెపి విద్వేషపూరిత ప్రసంగాలకు వేదిక ఫేస్‌బుక్‌

బిజెపి విద్వేషపూరిత ప్రసంగాలకు వేదిక ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ : భారత దేశంలో బిజెపి నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం సృష్టించిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.ఫేస్‌బుక్‌ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసింది. ఆ పార్టీ ఇటువంటి లేఖ రాయడం రెండు వారాల్లో ఇది రెండోసారి. విద్వేషపూరిత ప్రసంగాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకునేందుకు జుకర్‌బర్గ్‌కు చెందిన భారతీయ బృందం ఇష్టపూర్వకంగానే అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత దేశ సాంఘిక, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇది దారి తీస్తోందని పేర్కొంది. 40 కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్‌ను పరోక్షంగా భారతీయ జనతా పార్టీ నియంత్రిస్తోందని విదేశీ మీడియా ప్రచురించిన కథనంపై స్పందించాలని జుకర్‌బర్గ్‌ను కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ (ఆర్గనైజేషన్‌) కెసి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో రెండోసారి లేఖ రాయడానికి కారణాన్ని వివరిస్తూ, మూడు అంశాలతో విదేశీ మీడియా తాజాగా ఓ వ్యాసాన్ని ప్రచురించిందని వేణుగోపాల్‌ తెలిపారు. ఈ కొత్త అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని, భారత దేశంలో విదేశీ కంపెనీల కార్యకలాపాల చట్టం, దాని స్ఫూర్తి ఉల్లంఘనకు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. వేణుగోపాల్‌ ఆగస్టు 18న రాసిన లేఖలో అధికారంలోని బిజెపి పట్ల ఫేస్‌బుక్‌ ఇండియా టీమ్‌ సానుకూలత వ్యక్తం చేస్తోందని, దీనిపై దర్యాప్తు జరపాలని జుకర్‌బర్గ్‌ను కోరారు. ఓ విదేశీ పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ, వాట్సాప్‌ భారత దేశ కార్యకలాపాలను బిజెపి నియంత్రించేందుకు అనుమతి ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగా భారత దేశంలో వాట్సాప్‌ పేమెంట్‌ ఆపరేషన్స్‌కు లైసెన్స్‌ పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత దేశంలోని ఫేస్‌బుక్‌ కంపెనీ లీడర్‌షిప్‌ టీమ్‌లో ఒకరి కన్నా ఎక్కువ మంది బిజెపి పట్ల సానుకూలత, పక్షపాతం వ్యక్తం చేస్తున్నారని వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ సమస్య ప్రారంభంలో ఊహించిన దాని కన్నా విస్తృతమైనది, లోతైనది అని వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments