న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నప్పటికీ నీట్, జెఇఇ పరీక్షలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతపై ప్రతి ఒక్కరూ గళమెత్తాలని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు తగిన జాగ్రత్తలతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ మరోవైపు కాంగ్రెస్, వివిధప్రతిపక్ష పార్టీలు దేశంలోని కొన్ని వరదల సంభవించడం, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో నీట్, జెఇఇని వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) కార్యకర్తలు నీట్, జెఇఇ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ) ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు నిరాహార దీక్షలకు దిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్, జెఇఇ పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు శాస్త్రిభవన్ ఎదుట ఆందోళన చేశారు. తమిళనాడులో కూడా కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయంపై ఆందోళనలకు దిగారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రచారంలో భాగంగా నీట్, జెఇఇ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని రాహుల్‌గాంధీ పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న లక్షలాది విద్యార్థులు ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలన్నారు. ప్రభుత్వ విద్యార్థుల మాట వినేలా చేయాలన్నారు. ఇదిలా ఉండగా, నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం పౌరులందరికీ తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో హితవు పలికింది. తక్షణమే జెఇఇ, నీట్ పరీక్షల నిర్వహణపై బిజెపి ప్రభుత్వం మరోసారి పరిశీలన చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తున్న వీడియోలను పోస్టు చేసింది.
విద్యార్థుల వాణి వినండి… కేంద్రానికి సోనియా సూచన
నీట్, జెఇఇ పరీక్షలు నిర్వహించే విషయంలో విద్యార్థుల వాణి వినాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ మేరకు ఒక వీడియోను సోనియా గాంధీ పోస్ట్ చేశారు. నిమిషం పాటు సాగే ఈ వీడియోకు, ’స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ’ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఈ వీడియోలో సోనియాగాంధీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నా ఆలోచన కూడా మీ చుట్టూనే తిరుగుతోంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది చాలా కీలకం. ఇది కేవలం మీకే కాదు, మీ తల్లిదండ్రులకు కూడా చాలా ముఖ్యం. మీరే మా భవిష్యత్తు. మీ భవితే మాకు ముఖ్యం. మెరుగైన భారత్ మీపైనే ఆధారపడి ఉంది’ అని సోనియా గాంధీ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘మీ వాణి ప్రభుత్వం వింటుందని, అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వానికి నా విజ్ఞప్తి కూడా ఇదే’ అని సోనియాగాంధీ ఆ వీడియోలో పేర్కొన్నారు.
విద్యార్థుల అభిప్రాయం తీసుకోండి: రాహుల్
నీట్, జెఇఇ పరీక్షల విషయంలో విద్యార్థుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రానికి సూచించారు. అందరి ఏకాభిప్రాయంతో ఈ విషయంలో ముందుకెళ్లాలని కోరారు. కరోనా ఉద్ధృతి వేళ పరీక్షలు నిర్వహించొద్దంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టులో బిజెపియేతర పాలిత రాష్ట్రాల మంత్రులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీట్, జెఇఇ ఆశావహులు భద్రత విషయంలో రాజీపడడం సరికాదని రాహుల్ అన్నారు. విద్యార్థులు సహా అందరి ఏకాభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు విద్యార్థులను, ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. “ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులదే. గత మూడు నాలుగు నెలలుగా దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. కొవిడ్ విషయంలో తప్పుడు నిర్ణయాల వల్ల సంభవించిన వినాశనం, ఆర్థిక విధ్వంసం వంటివి దేశం భరించాల్సి ఉంది. అర్థం కాని విషయమేమిటంటే ఆ నొప్పిని మీరు ఎందుకు అనుభవించాలి” అని విద్యార్థులనుద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం విద్యార్థులపై తమ నిర్ణయాన్ని బలవంతంగా ఎందుకు రుద్దాలని చూస్తోందని రాహుల్ ప్రశ్నించారు. విద్యార్థులు తెలివైన వారని, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సూచించారు. వెంటనే విద్యార్థులతో చర్చించి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
జెఇఇ, నీటి వాయిదాకు… కాంగ్రెస్ నిరసనలు
RELATED ARTICLES