ప్రజాపక్షం / హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోట్లయితే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే ప్రస్తుత బిజెపి ప్రభుత్వానికి కూడా విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి కూలిపోవడం ఖాయమని వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హెచ్చరించారు. కేంద్ర విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోట్లయితే 2008 విద్యుత్ ఉద్యమ అమర వీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వారు ప్రకటించారు. ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమ’ అమరవీరుల 21వ సంస్మరణ సభ శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ కూడలిలో జరిగింది. విద్యుత్ ఉద్యమంలో అమరులైన బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డిలకు వామపక్షాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాల స్పూర్తితో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని వారు ప్రతిజ్ఞ చేశారు. సభలో సిపిఐ జాతీయ కార్యాదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, ఎంసిపిఐ నాయకులు ఎం.సుధాకర్, ఎస్‌యుసిఐ నాయకులు కె.మురహరి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకురాలు ఎస్.ఎల్.పద్మ తదితరులు ప్రసంగించారు. గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం’ మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వారు చెప్పారు. డాక్టర నారాయణ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను తదితర నినాదాలతో బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాల ఆర్ధిక సంపదను కేంద్రం గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ, ఎపి సిఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బిజెపి ప్రభుత్వ చర్యలపై పోరాడేందుకు ముందుకు రావాలన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చట్టాల సవరణ ద్వారా రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలను కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని, ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఇప్పటికే జిఎస్‌టి పేరుతో రాష్ట్రాలు కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజలు, రాష్ట్రాల హక్కులను హరిస్తూ సాగిస్తున్న నరహంతక పాలనకు వ్యతిరేకంగా వామపక్షాల పోరాటం కొనసాగుతుందన్నారు. తమ్మినేని వీరభధ్రం మాట్లాడుతూ నాడు ప్రపంచ బ్యాంకు విధానాల అమలులో భాగంగానే టిడిపి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేయగా, ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అంత కంటే ఉధృతంగా ప్రపంపచ బ్యాంకు, పెట్టుబడిదారి విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. పాలకులు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తూ సామాన్య ప్రజలు విద్యుత్ బల్లుబను వెలిగించుకోలేని పరిస్థితిని తీసుకువచ్చారని ఎం.సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, కార్యవర్గ సభ్యులు వి.ఎస్.బోస్, హైదరాబాద్ శాఖ కార్యదర్శి ఇ.టి.నరసింహా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నరసింహారావు, బి.వెంకట్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకురాలు కె.రమాదేవి, పిఓడబ్ల్యు నాయకురాలు ఝాన్సీ, సిపిఐ నాయకులు ఆర్. శంకర్ నాయక్, టి.రాజేందర్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు ఎం.అనిల్ కుమార్, ఆర్.బాల కృష్ణ, నిర్లేకంటి శ్రీకాంత్ (ఎఐవైఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాల్సిందే!
RELATED ARTICLES