మన ఎకానమీ లొసుగులను బట్టబయలు చేసిన కొవిడ్-19
నోబెల్ పురస్కారం గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్
న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వ్యవస్థలోనే విధానలోపం వుందని ఆర్థిక నిపుణులు ఘోషిస్తున్నారు. తాజాగా గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్‌డిఎ పాలనలో అమలవుతున్న ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్టమైనదని ఆయన చెప్పారు. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభాన్ని తట్టుకోలేకపోయిందని, కొవిడ్ 19 ఈ వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే చాలా లోపాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశాలను ఆచరణలో స్ఫూర్తిగా తీసుకునే భారత్ కూడా ఈ లోపాలను సైతం ఆచరించిందని, ప్రస్తుతం నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితికి ఇదే కారణమని తెలిపారు. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌తో వీడియో కాల్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ దుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. వలస కూలీలు ఉండే అధికార పర్యవేక్షణ లేని రంగాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ యూనస్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను తప్పుడు విధానంలో నడుపుతున్నారన్నారు. సమాజంలోని బలహీనతలను కరోనా వైరస్ వికృతం గా చూపించిందన్నారు. ఇవి సమాజంలో దాక్కుని ఉన్నాయని చెప్పారు. వీటికి మనం అలవాటుపడిపోయినట్లు తెలిపారు. నగరాల్లో ఉండే వలస కూలీలు కొవిడ్ సంక్షోభం వల్ల తిరిగి తమ స్వస్థలాలకు బలవంతంగా వెళ్ళిపోవలసి వచ్చిందని చెప్పారు. వీరిని మనం గుర్తించవలసి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వీరిని పరిగణనలోకి తీసుకోదన్నారు. వీరిని ఇన్‌ఫార్మల్ సెక్టర్ అని మాట్లాడతారని అన్నారు. ఇన్‌ఫార్మల్ సెక్టర్ అంటే వాళ్లతో మనకేమీ పని లేదని అర్థమని చెప్పారు. వారు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాదన్నారు. ఆర్థిక వ్యవస్థ ఫార్మల్ సెక్టర్‌తో ప్రారంభమవుతుందన్నారు. భారత దేశం, బంగ్లాదేశ్ పాశ్చాత్య విధానాలను అనుసరించి ఆర్థిక వ్యవస్థలను నడుపుతున్నాయని, ఇన్‌ఫార్మల్ సెక్టర్‌ను విస్మరించాయని అన్నారు. ప్రజల శక్తి, సామర్థ్యాలను మనం గుర్తించడం లేదన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “వలస కూలీలు మన నగరాలను నిర్మించారు. వారే పునాది, ఆ పునాదిపైనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. వారికి మెరుగైన జీవితం ఇవ్వడానికి మనం తగినంతగా చేయడం లేదు. అదికార పర్యవేక్షణ లేని రంగాన్ని విస్మరించరాదు” అని చెప్పారు
ఆర్థిక వ్యవస్థ పక్కదారి!
RELATED ARTICLES