HomeOpinionArticlesమార్గదర్శకుడు నాన్న

మార్గదర్శకుడు నాన్న

* మనస్సులో సున్నితత్వం…బయటకు కాఠిన్యం
* నాన్న నడిపించే నావికుడు
* బిడ్డల ఎదుగుదలలో కీలకపాత్ర
* ఎన్నో త్యాగాలకు ప్రతిరూపం
* క్షమించే నైజం..సర్దుకుపోయే తత్వం
* నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం
ప్రజాపక్షం/మిర్యాలగూడ : అమ్మ బిడ్డ ఆకలి తీరిస్తే…నాన్న అన్నం సంపాదించే మార్గాన్ని చూపుతాడు. బిడ్డలకు దిశానిర్దేశాన్ని చూపే మార్గదర్శి. కన్నతల్లి ప్రేమలో అమృతం ఉంటే ప్రేమలో కాఠిన్యంతో కూడిన జీవితం ఉంటుంది. తల్లి లాలనా, తండ్రి పాలనా ఎవరికైతే సమృద్ధిగా దొరుకుతాయో వారి జీవితం ఉజ్వలంగా ఉంటోంది. బిడ్డల బాధను చూసి తల్లి ప్రత్యక్షంగా బాధపడితే…తండ్రి పరోక్షంగా బాధపడతారు. తల్లి కళ్లతో ఏడితే తండ్రి హృదయంతో ఏడుస్తాడు. బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఇరువురూ ఆలోచిస్తారు. బిడ్డలు ఎదిగే కొద్ది తండ్రి వారి కష్టసుఖాలు చెప్పుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడు క్రమశిక్షణ ఏర్పడుతుంది. బాధ కలిగితే నాన్న ఉన్నాడనే ధైర్యం వస్తుంది. అన్నివిషయాలు చెప్పుకునే పిల్లలకు తండ్రులు చదువు ఇవ్వాలి. ఆజమాయిషీ చేయకూడదు. అలా చేస్తే బిడ్డలు దూరం అవుతారు. జీవితంలో ఉన్నతంగా ఎదగలేరు. ఎప్పటికైనా నాన్న నడిపించే నాయకుడిలాగానే ఉంటాడు.
ప్రతేడాది జూన్‌మూడో ఆదివారం పితృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్‌ డాడ్‌ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో తొలిసారి ఫాదర్స్‌డేను గుర్తించి జరుపుకున్నారు. తర్వాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది.ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతేడాది జూన్‌లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృవందన దినోత్సవంగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.
నిరంతర శ్రామికుడు..
నాన్న అంటే నడకలు నేర్పేవాడు. తప్పులు చేస్తే సరిదిద్దేవాడు. మన ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించేవాడు. మన ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించేవాడు. తల్లి భూదేవి అయితే తండ్రి ఆకాశమంతటివాడు. మనల్ని కంటికి రెప్పలా కాపాడేవాడు. జీవితంలో మన మొదటి హీరో నాన్నయే. అలాంటి నాన్న ప్రేమను తలచుకోవడానికి పాశ్చాత్యులు ఏర్పాటు చేసుకున్న రోజే ఫాదర్స్‌డే. కోపమొస్తే ఉరిమే నాన్న తాపమొస్తే కరిగిపోతాడు. తానెక్కలేని అందలాలు పిల్లలకు దక్కాలని పరితపించేవాడు నాన్న. పూర్వకాలంలో ఏది కావాలన్నా అమ్మనే అడిగేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలకాలంగా ఆ విధానంలో మార్పు వచ్చింది. నాన్న తాను ఏది కావాలంటే అది నిమిషాల్లో సమకూర్చగలడనే నమ్మకం ఇటీవల ఏర్పడుతుంది. నాన్న అంటే జీవిత చుక్కాని అని అంటారు. అందుకే కన్నవారే కనిపించే దైవాలని భారతీయ సంస్కృతి తెలియజేస్తుంది.
నాన్న మనసే వెన్న..
తల్లి, తండ్రి సంతానమనే శక్తివంతమైన పునాదుల మీద నిర్మాణమైంది. మన జీవితాన్ని ప్రభావితం చేయగల వారు తల్లిదండ్రులే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవని అంటారు. మనం జీవితంలో ఎత్తుగా ఎదగాలంటే తల్లిదండ్రుల స్థానం ఎంతో గొప్పది. తండ్రుల పట్ల మరచిపోయిన మన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి పాశ్చాత్యులు ఏర్పాటు చేసుకున్న దినాల్లో తండ్రుల దినోత్సవం ఒకటి. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మలాలిపాట ఎలాగో నాన్న నీతి పాటలు జీవితంలో అలాగ పనికివస్తాయి.
నాన్నే ధైర్యం…
జీవితమే ఒక నాటకరంగం. మనమంతా పాత్రధారులం అని ప్రపంచ ప్రఖ్యాత రచయిత, నాటకకర్త షేక్స్‌పియర్‌ అన్నాడు. పుట్టింది మొదలు చనిపోయే వరకు ఎన్నో పాత్రలు పోషించాలి. కొన్నిట్లో జీవిస్తాం..కొన్నిట్లో నటిస్తాం. ఇతర పాత్రల సంగతి ఎలా ఉన్నా తల్లి, తండ్రి పాత్రల్లో ఏ వ్యక్తయినా జీవించడమే తప్ప నటించడం ఉండదు. కుటుంబంలో అందరికీ రక్షకుడు తండ్రే. ఊహ తెలియని చిన్నారులను సైతం నాన్న పేరు వింటే చాలు. కొండంత ధైర్యం వచ్చేస్తుంది. పిల్లల దృష్టిలో నాన్న చేయలేని పని ఉండదు. నాన్న మీద అంత గురి. నడిచేటప్పుడు తడబడితే..చెయ్యందించే నాన్న.. జీవితాన్ని ఎలా ఎదురీదాలో నేర్పిస్తాడు.
పిల్లల్ని పెంచడం అంత తేలికైన పనేం కాదు. మొక్కలు, పశువుల్లా చిన్నారులు గాలికి పెరగరు. ఒకవేళ అదే జరిగితే గాలి మనుషులే అవుతారు తప్ప ప్రయోజకులు కాలేరు. మరి ఓ పద్ధతిగా క్రమశిక్షణతో పెంచడంలో తండ్రి పాత్ర కీలకం. అమ్మ ఆప్యాయంగా పిల్లలు కోరిందల్లా వండిపెడుతుంది. ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ మంచి చెడుల విచక్షణ తప్పొప్పుల విజ్ఞత, అటు విజ్ఞానం, ఇటు లోకజ్ఞానం అన్నీ తెలియజెప్పేది నాన్నే. నాన్న నేర్పిన పాఠాలే జీవితానికి పునాదులు. అందుకే..ఎంత ఎత్తుకు ఎదిగినా జ్ఞాపకాల పొరల్లోంచి నాన్న నాటిన స్మృతులు చెరిగిపోవు. ఫాదర్స్‌డే సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నాన్నకు జేజేలు పలుకుదాం.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments