ఉద్రిక్తతల సడలింపునకు ఇరుదేశాల అంగీకారం
ఫోన్లో చైనా, భారత్ విదేశాంగ మంత్రుల చర్చలు
రెచ్చగొడితే దీటైన జవాబు : మోడీ
19న అఖిల పక్ష సమావేశానికి పిలుపు
సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో అమరజవాన్లకు నివాళి
అమరవీరులకు భారత ప్రజల సెల్యూట్
గాల్వన్ లోయ మాదే : చైనా
ఘర్షణలో 35 మంది చైనా సైనికులు మృతి!
న్యూఢిల్లీ/బీజింగ్ : భారత్, చైనా సరిహద్దులో సోమవారం రాత్రి జరిగిన సైనిక ఘర్షణ రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచిన నేపథ్యంలో ఇరువర్గాలు చర్చలకు ఉపక్రమించడం శుభపరిణామం. భారత్, చైనా దేశాల మధ్య రెచ్చగొట్టే ప్రకటనలు వెలువడినప్పటికీ, రెండు దేశాల ప్రతినిధులు బుధవారంనాడు శాంతిచర్చలు ప్రారంభించారు. ఉద్రిక్తతల సడలింపునకు ఇరుదేశాలు అంగీకరించాయి. చైనా, భారత విదేశాంగ మంత్రులు పరస్పరం ఫోన్లో సంభాషించుకొని, తక్షణమే ఉద్రిక్తతల సడలింపునకు ఆమోదం తెలిపారు. మరోవైపు, ఘర్షణ వేదిక గల్వన్లోయలోనూ ఇరుదేశాల సైనిక వర్గాల మధ్య శాంతి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాగ్ యీ బుధవారం సాయంత్రం భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‌కు ఫోన్ చేసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సాధ్యమైనంత త్వరగా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి అంగీకారం కుదిరింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించాలని కూడా నేతలిద్దరూ ఒప్పుకున్నారు. సోమవారం రాత్రి గల్వన్‌లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఇరుదేశాల నేతలు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. అందులో సైనికాధికారి, తెలంగాణకు చెందిన సూర్యాపేటవాసి కల్నల్ సంతోష్‌బాబు కూడా వున్నారు. తమకు అందిన సమాచారం మేరకు చైనా పక్షాన 35 మంది మరణించారని, వారిలో ఒక ఉన్నత సైనికాధికారి కూడా వున్నారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని అందించాయి. ఈ తరహా ఘర్షణ జరగడం ఐదు దశాబ్ధాల్లో ఇదే ప్రథమం కావడం వల్ల ఉద్రిక్తత తీవ్రంగా ఉన్నట్లు అన్పిస్తున్నదని, చర్చలు, సంప్రదింపులకు చొరవచూపిస్తే, ఉద్రిక్తత సడలిపోతుందని పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి అధికారులు, అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. రెచ్చగొట్టే చర్యలకుపాల్పడితే దీటైన జవాబు చెపుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ మాట్లాడుతూ, సార్వభౌమత్వం విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లోనే ప్రధానితోపాటు సిఎంలందరూ అమరజవాన్లకు నివాళి అర్పించారు. కాగా, ఈ ఘటనపై ఈనెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు మోడీ తెలిపారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల టెలిఫోన్ సంభాషణల్లో జయశంకర్ తన అసమ్మతిని వాంగ్‌కు తీవ్రంగా తెలియజేశారు. ఈ ఘర్షణ రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై బలమైన ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ఇలాంటి అనూహ్యపరిణామాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చైనా తమ చర్యలను తిరిగి అంచనా వేసుకొని, సరిచేసుకోవాలని జయశంకర్ కోరారు. ఈ ఘర్షణకు చైనాయే బాధ్యత వహించాలని, పథకం ప్రకారమే ఇది జరిగిందని కూడా ఆరోపించారు. గత ఒప్పందాల ఉల్లంఘనగానే దీన్ని భావించవచ్చని, యథాతథ పూర్వస్థితికి తీసుకురావడానికి గట్టి కృషి జరగాలని సూచించారు. దీనికి వాంగ్ స్పందిస్తూ, గతంలో ఇరుదేశాధినేతల మధ్య కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు కలిసి సరిహద్దులో శాంతిని, సుస్థిరతను సాధించాలన్నారు. భారత్, చైనాలు రెండూ జనాభాలో అతిపెద్ద దేశాలుగా అవతరించాయని, చారిత్రక సాంప్రదాయాలతో, స్వావలంబనతో అభివృద్ధి సాధిస్తున్నాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, సరైన దిశగా పయనిస్తూ పరస్పర గౌరవం, తోడ్పాటుతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం వుందని వాంగ్ చెప్పారు.
శాంతిచర్చలు
RELATED ARTICLES