భారత్, చైనా సైనికులు బాహాబాహీ
20 మంది భారత సైనికులు మృతి
బోర్డర్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత
సడలించేందుకు శాంతిచర్చలు షురూ
సైనికాధికారులతో రాజ్‌నాథ్ వరుస భేటీలు
గల్వన్‌లోయ పరిస్థితిపై అంచనావేస్తున్న ఇరుదేశాలు
లడఖ్ : భారత్, చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. సరిహద్దు ప్రాంతంలో తూర్పు లడఖ్‌లోని గల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో 20 మంది భారత సైనికులు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిలో ఓ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు పది మృతదేహాలు లభించాయి. మిగిలిన మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఈ ఘర్షణలో 43 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాకపోతే దీన్ని చైనా వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. అమరుడైన భారత సైనికాధికారి కల్నల్ బిక్కమల్ల సంతోష్బాబుగా గుర్తించారు. అతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట వాసి. ఇరుదేశాల సరిహద్దు సైనికులంతా పాల్గొన్న వైరం లా ఇది కన్పించడం లేదు. ఆవేశకావేశాలకు లోనై కొంతమంది సైనికుల మధ్య జరిగిన ఘర్షణలా భావిస్తున్నారు. భారత్, చైనాల మధ్య సైనికస్థాయిలో జరిగిన శాంతిచర్చల అనంతరం ఇరుదేశాల సైనికులు సరిహద్దు నుంచి ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు భారత్ ప్రకటించింది. గడిచిన ఏడు వారాలుగా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. అయితే ఈ పరిస్థితిని శాంతపర్చేందుకు సైనికస్థాయి చర్చలు జరిగాయి. దీంతో బలగాలను ఉపసంహరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే సైనికుల ఉపసంహరణ జరుగుతుండటంతో ఇరుదేశాల సైనికులు ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు ఇరుదేశాలు ప్రయత్నాలు ఆరంభించాయి. అయితే ఈ ఘర్షణ పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఈ ఘర్షణ జరిగిందని చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి లూ ఝావోహుయ్ తనతో జరిగిన సమావేశంలో అసమ్మతి వ్యక్తం చేసినట్లు బీజింగ్‌లో భారత రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. తాజా ఘటనపై ఓవైపు బీజింగ్‌లో ఉన్నత అధికార స్థాయి సమావేశం జరగ్గా, న్యూఢిల్లీలోనూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విదేశాంగ మంత్రి జైశంకర్, సైనికాధికారులతో సమీక్షించారు. ఈ ఉదంతంపై ప్రధాని మోడీకి కూడా వివరించారు. కాగా, ఘర్షణ జరిగిన ప్రదేశంలోనే ఇరుదేశాల సైనికులు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుపుతున్నారని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఘర్షణలో ఒక సైనికాధికారి, ఇద్దరు సైనికులు మరణించినట్లు భారత సైన్యం ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఇరువర్గాలకు చెందిన సీనియర్ సైనికాధికారులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని, ఉద్రిక్త వాతావరణం సడలినట్లుగా భావిస్తున్నట్లు అదే ప్రకటనలో తెలిపారు.
45 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత…
భారత్, చైనా దేశాల సైనికుల మధ్య ఈ తరహా ఘర్షణ 45 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగింది. 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్లా వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు భారత సైనికులు బలయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఘటన జరిగింది. గత ఏప్రిల్ నుంచే లడఖ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు విపరీతంగా మోహరించారు. భారత్ వందలాది మంది సైనికులును సరిహద్దుకు తరలించింది. ఈ క్రమంలోనే గత నెలలో పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఇరుదేశాల సైనికులు ఘర్షణకు తలపడ్డారు. ఈ సందర్భంలో ఇరువైపులా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాకపోతే ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఆ తర్వాత పాంగాంగ్ సరస్సు ప్రాంతంతోపాటు గల్వన్ లోయ, డెమ్చోక్, దౌలత్‌బేగ్ ఓల్దీ ప్రాంతాల్లో ఇరుసైనికులు పెద్దసంఖ్యలో గస్తీ కాశారు. ఇక అప్పటి నుంచి పరిస్థితి రోజురోజుకీ ఘర్షణపూరితంగా మారుతుండటంతో ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. గత వారం సైనిక స్థాయి చర్చలు జరిగాయి. గతంలో భారత్, చైనా అగ్రనేతల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు నడుచుకోవాలని, సరిహద్దులో ఉద్రిక్తతను సడలించుకోవాలని అంగీకారం కుదిరినమీదట వివాదం సద్దుమణిగిందని అంతా భావిస్తున్న తరుణంలో తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదివరకు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఇరుదేశాల బలగాలు బాహాబాహీకి తలపడిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఏనాడూ ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితి ఎటు వెళుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్మీచీఫ్ ఎంఎం శరవణే కూడా ఉద్రిక్త పరిస్థితులు తొలగాయని ప్రకటించిన కొన్ని గంటలకే ఈ ఘటన సంభవించింది. ఈ ఘటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో శరవణే జరపాల్సిన పర్యటన రద్దయింది. ఇదిలావుండగా, చైనా సైనికులతో ఘర్షణపడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు. వారు గత ఏడాదిన్నకాలంగా ఈ సరిహద్దు ప్రాంతంలో గస్తీలో వున్నారు. అమరుడైన సూర్యాపేటవాసి సంతోష్‌బాబు ఈ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా వున్నారు. ఈ ఘటనలో చైనావైపు 43 మంది సైనికులు మరణించినట్లు గ్లోబల్ టైమ్స్ కథనాలు పేర్కొన్నప్పటికీ, చైనా ఇంకా దీన్ని ధృవీకరించలేదు.
తలనొప్పిగా మారిన గల్వన్‌లోయ రోడ్డు…
గల్వన్‌లోయ రోడ్డు నిర్మాణం ఇరుదేశాల మధ్య తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. 1962లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గల్వన్ లోయ కూడా ఒకటి. ప్రస్తుతం ఇక్కడ భారత్ ఒక రహదారిని నిర్మిస్తున్నది. గతంలో పర్వత మార్గంలో సైనికులు ఈ లోయకు చేరుకోవాలంటే 8 గంటల సమయం పట్టేది. కానీ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే భారత బలగాలు కేవలం అరగంట వ్యవధిలోనే గల్వన్లోయకు చేరుకోగలరు. పైగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ రహదారిపై ప్రయాణించే వీలుంది. అంతేగాకుండా, ఈ మార్గం నేరుగా దౌలత్‌బేగ్ ఓల్దీ విమానాశ్రయానికి వెళ్లే మార్గాన్ని కలుపుతుంది. భారత్‌కు చెందిన సరిహద్దు రహదారి సంస్థ (బిఆర్ఓ) ఆధ్వర్యంలో 225 కి.మీ. ఈ రహదారి(డర్బుక్ ష్యుంకు-దౌలత్‌బేగ్ ఓల్దీ) నిర్మాణం జరుగుతోంది. సహజంగానే చైనా ఈ రహదారి నిర్మాణంపై అభ్యంతరం చెపుతోంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే, భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగడానికే అవకాశాలు ఎక్కువని చైనా చెపుతోంది. ఈ రహదారిని త్వరగా పూర్తిచేసేందుకు భారత్ ఏకంగా 1,600 మంది కార్మికులను ఇక్కడకు తరలించి, హుటాహుటిన రోడ్డు నిర్మాణం పూర్తి చేసే పనులు చేపట్టడం కూడా చైనా ఆందోళనకు తావిస్తోంది.
సరిహద్దు ఘర్షణ
RELATED ARTICLES