న్యూఢిల్లీ :కార్మికుల పనిగంటలు 8 నుంచి 12 గంటలకు పెంచాలని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ చర్యను ఆల్ ఇండియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) స్వాగతించింది. ఇదేవిధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో కార్మిక చట్టాలలో తీసుకువచ్చిన మార్పులన్నింటి ఉపసంహరించుకోవాలని సోమవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ డిమాండు చేశారు. తయారీ, ఉత్పాదనలో కార్మికులు తమ శక్తిని సక్రమంగా వినియోగించినప్పుడే ఆర్థికవ్యవస్థ ఊపందుకోగలదని ఆమె పేర్కొన్నారు. పని పరిస్థితులలో కార్మికులకు న్యాయం జరగాలనీ, భద్రత, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలనీ, తగినంత వేతనాలు ఇవ్వాలనీ, 8గంటల పనివిధానం, ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతులు, సామాజిక భద్రత తదితరాలు కొనసాగాలని కోరారు. కార్మిక చట్టాల నిర్వీర్యం, రక్షణ చర్యలు తొలగింపు వంటివి ప్రపంచంలో ఎక్కడా కూడా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ లేదా పెంపుదలకు దోహదపడలేదని ఏఐటీయూసీ పునరుద్ఘాటిస్తోందని అమర్‌జిత్ కౌర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కార్మిక సంఘాలను గౌరవించడం, ఉమ్మడి చర్చలు ఎప్పుడూ కూడా పారిశ్రామిక శాంతికి సహాయపడతాయని స్పష్టంచేశారు. కార్మికహక్కులు న్యాయం పొందడానికి ఎల్లప్పుడూ ఉపయోగపడతాయన్నారు. నమోదుకాని యూనిట్లు లేదా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు/క్యాజువల్ ప్రాతిపదికన పనిచేస్తూ చట్టాలకు వెలుపల వుండేవారికి కార్మిక హక్కులు న్యాయం చేస్తాయని తెలిపారు. ఇంటి పనివారు/లోడింగ్, అన్‌లోడింగ్ చేసే వారు/ పోర్టర్లు, కూలీలు, నమోదుకాకుండా మిగిలిపోయిన కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని కోరేందుకు సహాయపడతాయని అమర్‌జిత్ కౌర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన క్రూరమైన చర్యలను ఉపసంహరించుకునేందుకు కేంద్ర కార్మికసంఘాలు తీసుకువచ్చిన ఒత్తిడి, అన్ని రంగాలలోని కార్మికవర్గం ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యాచరణ ఫలితంగానే ఇది సాధ్యమైందని ఏఐటీయూసీ పునరుద్ఘాటిస్తోందని అమర్‌జిత్ కౌర్ తెలిపారు.
పోరాటాల ఫలితమే..
పనిగంటల పెంపు ఉపసంహరించుకున్న రాజస్థాన్ ప్రభుత్వం
స్వాగతించిన ఏఐటీయూసీ
RELATED ARTICLES