బేకరీలు, ఆహార పదార్థాల షాపులకు రోజు విడిచి రోజు సాధ్యమా?
నష్టపోతున్నామంటున్న నిర్వాహకులు
అనుమతులున్నాయంటున్న ఉన్నతాధికారులు
సిరి,బేసి మార్కింగ్ చేస్తున్న సర్కిల్ అధికారులు
బల్దియాలో కొరవడిన సమన్వయం
ప్రజాపక్షం/హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు నిబంధనలు స్వీట్ షాప్స్, బేకరీలు, ఇతర ఫుడ్ ఎష్టాబ్లిష్‌మెంట్‌లకు ఇబ్బందికరంగా మారాయి. ఆహారపదార్థాలు విక్రయించే బేకరీలు, స్వీట్‌షాపులు వంటివాటికి అనుమతులు ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి దుకాణాలకు సర్కిల్ అధికారులు సరి-,బేసి మార్కింగ్ చేస్తున్నా రు. బల్దియా యంత్రాంగంలో సమన్యయలోపం నిర్వాహకులకు శాపంగా మారుతోంది. దుకాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని సర్వ త్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దుకాణాలను రోజు విడిచిరోజు తెరిచే విధానం పాటించాలని సూచించడంతో సంబంధిత యజమానులు తీవ్రస్థాయిలో నష్టపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. తయారు చేసిన స్వీట్స్, బేకరీ ఐటమ్స్ మరుసటి రోజు విక్రయించే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో ఆహార పదార్థాలు కుళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా షాపుల నిర్వహణ విషయంలో సరైన నిబంధనలు రూపొందించకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్ట పోవాల్సిన దుస్థతి నెలకొందని వాపోతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల నిబంధనలు క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో దుకాణాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహార పదార్థాలు తయారు చేసే బేకరీలు, స్వీట్ షాపులు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ల విషయంలో టేక్‌అవే పద్ధతిలో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించామని ఉన్నతాధికారులు పేర్కొటుండగా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం సరి-బేసి విధానంలోనే నిర్వహించుకోవాలని చెబుతున్నారు. దీంతో స్వీట్‌షాపులు, బేకరీల నిర్వహకులు అయోమయంలో పడ్డారు. వీరికి సరి-,బేసి విధా నం గుదిబండగా మారింది. తయారు చేసిన ఆ హార పదార్థాలు మరుసటి రోజు కూడా విక్రయించుకునేందుకు వెసులుబాటు ఉండటం లేదు. ఒకరోజు దుకాణం చెరిచిన అనంతరం మరుసటిరోజు మూసివేయాల్సి రావడంతో నష్టపోవాల్సి వస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారపదార్థాల విక్రయించే షాపులు, బేకరీల విషయంలో నిబంధనలు సడలించాలని నిర్వాహకులు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు ఐదువేల వరకు స్వీట్‌షాపులు, బేకరీ లు ఉంటాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొం దుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా మూసేయడంతో ఈ దుకాణాలలో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయారు. భౌతిదూరం పాటిస్తూ టేక్ అవే పద్ధతిలో విక్రయాలు జరుపుకొవచ్చని ప్రభుత్వం పేర్కొనగా, మరోవైపు క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంగా మార్కింగ్… సర్కిల్ అధికారులు సరి-,బేసి విధానానికి సంబంధించిన నెంబర్ మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వీట్ షాపులు, బేకరీలు, టిఫిన్, హోటళ్లకు కూడా సరి-,బేసి విధానంలో మా ర్కింగ్ చేశారు. జిహెచ్‌ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్లు ఆహారపదార్థాలు విక్రయించే వాటికి అనుమతులు ఉన్నాయని, టేక్ అవే పద్ధతి పాటించాలని చెబుతున్నారు. కానీ కొన్ని సర్కిళ్లలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సి బ్బంది దుకాణాలు తెరుస్తున్న వారిని మాముళ్ల కోసం వేధింపులకు గురి చే స్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల దుకాణాలు తెరుచుకోకుండా అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు నెలల పాటు మూసి వేసిన దుకాణాలకు గీరాకి ఎలా వస్తుందని తమకు ఆందోళన ఉంటే, మరోవైపు బల్దియా సిబ్బంది వేధింపులతో మరింత ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. విధానం అమలులో ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాల తయారీని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.