ఎపి ప్రభుత్వానికి కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ : నాగార్జున సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుద ల నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇఎన్‌సికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెల వరకు చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో బోర్డు పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని బోర్డు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని బోర్డు సూచించింది. ఎపి ప్రభుత్వానికి సాగర్ కుడి కాల్వ ద్వారా 158.255 టిఎంసిల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టిఎంసిల నీటిని వాడుకున్నట్లు బోర్డు లేఖలో తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టిఎంసిల నీటిని కేటాయించగా ఇప్పటి వరకు ఎపి ప్రభుత్వం 48.328 టిఎంసిల నీటిని వినియోగించినట్లు పేర్కొంది. రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయపడింది. ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున ఆయా కాల్వల ద్వారా నీటి విడుదల ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎపి ప్రభుత్వానికి సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో పేర్కొంది.
తెలంగాణ సర్కార్‌కు కృష్ణా బోర్డు లేఖ
రాష్ట్రంలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని.. వాటికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఎపి ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డు స్పందించింది. ఎపి ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి బోర్డు లేఖ రాసింది. 2019 అక్టోబర్ 16 నాటి లేఖలోనూ వివరాలు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని లేఖలో గుర్తుచేసింది. ఎపి ఫిర్యాదు నేపథ్యంలో ప్రాజెక్టుల వివరాలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాలమూరు డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుల సమగ్ర వివరాలు, ప్రాజెక్టుల డిపిఆర్లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.