ప్రజాపక్షం/న్యూఢిల్లీ ; కార్మిక చట్టాల్లో చేస్తున్న దుర్మార్గమైన మార్పులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లాక్డౌన్ కాలంలో అవసరమైన వారందరికీ రేషను పంపిణీ, నగదు బదిలీ చేయాలని, వలస కార్మికులను సత్వరమే ఇళ్లకు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఎఐటియుసి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారంనాడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు, మండల, గ్రామస్థాయుల్లో పనిస్థలాలు, యూనియన్ కార్యాలయాలు, నివాసాలతోపాటు వేలాది ప్రదేశాల్లో సోమవారం నిరసన దినం పాటించి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎఐటియుసి కార్యకర్తలు, కార్మికులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. కార్మిక వ్యతిరేక చట్ట మార్పులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు ఇంకా తమ స్వస్థలాలకు చేరుకోలేదని, వారిని సురక్షితంగా చేర్చాలని, అవసరమైతే మరిన్ని బస్సులు, రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. లాక్డౌన్ కారణంగా 110 కోట్ల మంది ప్రజలు సంపాదన లేక ఇబ్బందుల్లో పడ్డారని, ప్రతి కుటుంబానికి మూడు నెలలపాటు రూ. 7500 చొప్పున నగదు, రేషను అందజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కరోనా ప్రమాదం ఇంకా తొలగకుండానే ఉద్యోగులు, కార్మికులను పనికి పిలుస్తున్న యాజమాన్యాలు తక్షణమే వారికి తగిన ఆరోగ్య భద్రత కల్పించాలని, పనిగంటలు తగ్గించి, అవసరమైన హెల్త్కిట్లు అందజేయాలని కోరారు. కాగా, వివిధ రాష్ట్రాల్లో ఎఐటియుసి స్వంతంగానే నిరసనలు చేపట్టగా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఇతర యూనియన్లతో కలిసి ఉమ్మడి ఆందోళనలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా ఎఐటియుసి నిరసనలు
RELATED ARTICLES