ఆర్థిక కార్యకలాపాలు, లాక్డౌన్ నంచి వైదొలిగే అంశంపై సమాలోచనలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభన వల్ల భారత్ లో విధించిన లాక్డౌన్ నుంచి వైదొలిగే అంశం, ఆర్థిక కార్యకలాపాలను గాడిన పెట్టే వ్యూహంపై సమాలోచనలు జరపడానికి ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మధ్యాహ్నం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి అనంతరం ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశంలో కావడం ఇది ఐదవసారి. కాగా, తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం వెల్లడించింది. అత్యధికంగా కరోనా కేసు లు నమోదు కావడంతో రెడ్జోన్లుగా మారిన జిల్లాలను ఆరెంజ్, గ్రీన్జోన్లుగా మార్చడం, ఆర్థిక కార్యకాలాపాల ప్రోత్సాహంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 27వ తేదీన చివరిసారిగా ప్రధాని సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత కరోనా వైరస్ సోకిన వారి బాధితుల సంఖ్య రెట్టింపయింది. 27వ తేదీ నాటికి కేవలం 28 వేల కేసులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 63 వేలకు చేరువులో ఉంది. చివరి వీడియో కాన్ఫరెన్స్ తరువాత లాక్డౌన్ మరో రెండు వారులు పొడిగిస్తూ ఈనెల 17 వరకు విధించారు. అయితే ఈసారి ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాల్లో అనేక సడలింపులిచ్చారు. ఇదిలా ఉండగా, సోమవారం నాటి సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత సమావేశంలో కేవలం ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. చివరగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేవలం 9 మంది ముఖ్యమంత్రులకే మాట్లాడే అవకాశం ఇవ్వగా.. ఈ సారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సిఎస్‌లు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో ఆదివారం ఉదయం కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మాట్లాడారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీల రాకతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వారు ఈ భేటీలో ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాలు రెడ్జోన్లుగా మారుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. ఇలాగైతే సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమేననన్న భావన వారి నుంచి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇదే అంశం రేపటి ముఖ్యమంత్రులతో సమావేశంలోనూ చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
నేడు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
RELATED ARTICLES