ప్రస్తుత కరోనా మహమ్మారి సంక్షోభాన్ని మానవాళి, సైన్స్ అంతిమంగా అధిగమిస్తాయి. అనేక సిద్ధాంతాలు, తాత్వికతలు ముందుకొస్తాయి. ప్రజలు, ప్రభుత్వాల ముందు అనేక భాష్యాలు ఉంచబడతాయి. అయితే కోవిడ్ 19 అనంతర ప్రపంచం ఇప్పటిలాగే ఉంటుందా లేక మార్పు చెందుతుందా లేక సామాజిక రాజకీయ పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత అమాను షం, దోపిడీదారీ అవుతుందా? అన్నది ప్రశ్న. “కోవిడ్ 19 నల్ల ఏనుగు. ప్రకృతిపై మనం పెచ్చుమీరి సాగించిన వినాశక యుద్ధాల తార్కిక ఫలితం ఇది” అని థామస్ ఎల్ ఫ్రీడ్‌మాన్ ఇప్పటికే రాశారు. అందువల్ల రానున్న రోజుల్లో ముమ్మరంగా బహిరంగ చర్చలు, ప్రజల నుంచి పరిశీలన జరుగుతుంది. మార్క్, మార్కిజం అందులో కేంద్రబిందువు అవుతాయి.
“తత్వవేత్తలందరూ వివిధ మార్గాల్లో ప్రపంచానికి భాష్యం చెప్పారు. దాన్ని మార్చటమెలా అన్నదే ప్రశ్న” అని ఫ్యూర్‌బక్‌పై థీసిస్‌లో మార్క్స్ రాశారు.ఈ ప్రాథమిక అంశంపైనే మార్క్, ఆయన జీవితకాల సహచరుడు ఎంగెల్స్ తమ తాత్విక అన్వేషణను నిర్వహించారు. మానవ అస్థిత్వం, మానవులు, ప్రకృతి మధ్య సంబంధం గూర్చి, మానవ ప్రాణుల, ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి, పునరుతత్తి ఎలా జరుగుతున్నదో వారు విశ్లేషించారు. మార్క్, ఎంగెల్స్ ఇరువురూ “సంపదకు, మానవ అస్థిత్వానికి అవసరమైన ప్రాథమిక మౌలిక పరిస్థితులకు మూలం శ్రమ” అని వక్కాణిస్తూ, ప్రకృతి గతి తార్కికతను విశ్లేషించారు. ప్రజలు, భూమి, నీరు, గాలి మధ్య సామరస్యం ఎలా మార్పులకు దారితీస్తుందో వారు పేర్కొన్నారు. వాస్తవానికి మార్ తమ ప్రసిద్ధ రచన ‘పెట్టుబడి’లో “శ్రమ అనేది మున్ముందుగా మనిషి, ప్రకృతి రెండూ పాల్గొన్న క్రమం” అని వివరించారు. శ్రమ క్రమం అనేది ఉత్పత్తి క్రమం తప్ప మరొకటి కాదని మార్క్ కూలంకషంగా వివరించారు. ఆ విధంగా, సంపదకు శ్రమ ఎలా మూలమో, శ్రామిక శక్తి ఏ విధంగా మిగులు విలువ ఉత్పత్తి చేస్తూ ఉంటుందో అద్భుతంగా వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కింద ఉత్పత్తి సాధనాల యాజమానులైన పెట్టుబడిదారులు మిగులు విలువను ఎలా హక్కుభుక్తం చేసుకుంటారో అదే గ్రంథంలో మార్క్ వివరించారు. మిగులు విలువను సొంతం చేసుకోవటం ఒక వైపున సంపద కేంద్రీకరణకు ఎలా దారితీస్తుందో, మరో వైపున శ్రమజీవులను దరిద్రులుగా ఎలా మార్చుతుందో కూడా ఆయన వివరించారు. ఈ వ్యత్యాసం, అసమానత శ్రమజీవులను దారుణమైన పని, జీవన పరిస్థితులకు లోను చేస్తుంది.
ఎంగెల్స్ సమాజ గృహ సమస్యను, ఆ సమస్యను బూర్జువా వర్గం ఎలా పరిష్కరిస్తుందో విస్తృత దృష్టితో విశ్లేషిస్తూ, “కార్మికులు క్రిక్కిరిసి నివసిస్తుండే బీద జిల్లాలు, మన పట్టణాలను అప్పుడప్పుడూ ఆవహించే అంటువ్యాధులన్నిటికీ ఉత్పత్తి ప్రదేశాలు. కలరా, సన్నిపాత జ్వరం, టైఫాయిడ్ జ్వరం, ఆట్లమ్మ, ఇతర వినాశకర వ్యాధుల క్రిములు ఈ కార్మికవర్గ క్వార్టర్లవద్ద ఉండే ప్రాణాంతకమైన గాలి, విషపూరిత నీటిలో గుడ్లు పెడతాయి” అన్నారు. భారతదేశం సహా అన్ని దేశాలలోని వలస కార్మికులు ఎందుకు అటువంటి అనూహ్యమైన ఇబ్బందులు, బాధలు అనుభవిస్తున్నారో, కోవిడ్ 19 మహమ్మారి బాధితులవుతున్నారో ఇది వివరిస్తున్నది.
పెట్టుబడిదారీ ప్రపంచంలో గత రెండు దశాబ్దాలుగా సంభవిస్తున్న పరిణామాలు పెట్టుబడిదారులు తమ దౌర్జన్యపూరితమైన దోపిడీని, లాభాలను గ్యారంటీ చేసుకునే నిమిత్తం వారు తమ దోపిడీని శాశ్వతం చేసుకునే కొత్త ఒప్పందాలు, ప్రణాళికల గూర్చి ఆలోచించేటట్లు చేశాయి. కోవిడ్ 19కి ముందు, ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ సబ్‌ప్రైమ్ రుణ సంక్షోభంలో పడిన 2008 నాటినుండీ వెనక్కు మరలలేని సంక్షోభ దశలో ప్రవేశించింది. కోవిడ్ 19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్‌పైకి మరింతగా తోసింది.
ఈ వైరస్ సంబంధ మహమ్మారి అన్ని దేశాలను, అన్ని సముదాయాలను, అన్ని వర్గాలను ఒకే రీతిన బాధిస్తున్నదని భావించేవారు చాలామంది ఉన్నారు. అందువల్ల, దాన్ని రూపుమాపేందుకు మనం ముందుగా ప్రభుత్వాలను అనుమతించాలని, అటు తర్వాత మన సమస్యలపై మనం పోరాడుదాం అని వారు అంటారు. అయితే అది సరైంది కాదు. మహమ్మారితో పోరాటం పేరుతో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు నియంత్రణను ఎక్కువ ఎక్కువగా తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి.
బిజెపి కూటమి దేశాన్ని మతతత్వ ఫాసిస్టు రాజ్యంవైపు నెట్టటానికి ఈ పరిస్థితిని అనువుగా ఉపయోగించుకోవటానికై చేస్తున్న ప్రయత్నాన్ని భారతదేశంలో మనం చూస్తున్నాం. ఈ పెట్టుబడిదారీ, ఫాసిస్టు రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లోని ఆగ్రహాన్ని, అసంతృప్తిని సమీకరించేందుకు, సరైన మార్గంలో పెట్టేందుకు వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ శ్రమజీవులకు అన్ని హక్కులూ నిరాకరిస్తూ కోట్లాదిమంది సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నది.
కొవిడ్ సంక్షోభం తదుపరి మార్క్ మళ్లీ చర్చలోకి వస్తారు!
RELATED ARTICLES