తరుగుతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ : పౌరసరఫరాల సంస్థ ద్వారా రేషన్ కార్డులపై ఇస్తున్న విధం గా నిత్యావసర సరుకులు, నగదును కార్డులు లేని అర్హులైన పేదలందరికీ అందజేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయిందని, ఇందుకోసం దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉందని ఆయన తెలిపారు. అనేక పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చినా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదని పేర్కొన్నారు. కోవిడ్ రక్కసితో పేదలు విలవిలలాడుతున్నారని వారందరికీ సరుకులు, డబ్బులు అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోడానికి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కోరారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారస్థులు ఖరీదు చేసినపుడు వసూలు చేసే మాదిరి తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు ఐదారు కిలోలు తీస్తున్నారని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లాలో రైతులు దీనిపై ఆందోళన చేస్తే పోలీసులు అరెస్టులు చేయడాన్ని చాడ వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతులు పండించిన ధాన్యాన్ని తరుగుతో నిమిత్తం లేకుండా యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాలు, వడగండ్ల వల్ల పలు జిల్లాల్లో ధాన్యం తడిచిపోయిందని, పండించిన రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడని తెలిపారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు రైతుల పెట్టుబడులకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన మాదిరిగానే ఉద్యానవన పంటలు, పండ్లు పండించిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.