ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ వలసలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాజాగా ఆయన సంతకం చేశారు. దీంతో అమెరికాలోకి ప్రవేశించే విదేశీ వలసలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతానికి 60 రోజుల పాటు వలసలపై నిషేధం ఆదేశాలు ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే వీసా వచ్చి అమెరికాలోకి ప్రవేశించాలనుకునే ఉద్యోగార్థులకు ట్రంప్ నిర్ణయంతో నిరాశే మిగిలింది. . అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆ ఆర్డర్లో తెలిపింది. బుధవారం రాత్రి శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2.20కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం విదేశీయులకు ఇబ్బంది కలిగించినా… అమెరికన్లకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక పతనం నుంచి అమెరికా కార్మికులను రక్షించేందుకేనని స్పష్టం చేశారు. అమెరికా పౌరులకు సంబంధించి శక్తివంతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉన్న తాత్కాలిక కార్మికులకు మినహాయింపు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. వైద్య సిబ్బందితో పాటు పెట్టుబడి విధానంతో అమెరికాలో శాశ్వత నివాస హోదాలో న్యాయబద్ధంగా ప్రవేశించాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. అలాగే అమెరికా పౌరుల భాగస్వామ్యులు, వారి 21 ఏళ్లలోపు పిల్లలకు కూడా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.