HomeLife StyleHealthతొలి మొబైల్‌ కరోనా వైరాలజీ ల్యాబ్‌

తొలి మొబైల్‌ కరోనా వైరాలజీ ల్యాబ్‌

ప్రారంభించిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, కిషన్‌రెడ్డి, మంత్రి కెటిఆర్‌
2వేల టెస్టులు చేసే సామర్థ్యం
ఐక్లీన్‌, ఐసేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌- 3 ల్యాబ్‌ను రూపొందించిన డిఆర్‌డిఒ
కరోనా పరీక్షలు, వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీపై పనిచేయనున్న ల్యాబ్‌
రెండు భారీ కంటైనర్లలో 15 రోజుల్లోనే రూపకల్పన

ఇఎస్‌ఐ కళాశాల ఆవరణలో ఏర్పాటు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ హైదరాబాద్‌ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటుచేశారు. ఈ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆన్‌లైన్‌లో గురువారం ప్రారంభించారు. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తల బృందం అందించిన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ఐకామ్‌, ఐక్లీన్‌ సంస్థ సహకారంతో దీన్ని రూపొందించించారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్‌, డిఆర్‌డిఒ అధికారులు  పాల్గొన్నారు. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు. ఐ క్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌ ల్యాబ్‌ను డిఆర్‌డిఒ తయారు చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు భారీ కంటైనర్లలో దాదాపు 15రోజుల్లోనే దీన్ని రూపొందించినట్లు తెలిసింది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి ల్యాబ్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీనిని త్వరలోనే ఇఎస్‌ఐ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ  మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 2వేల టెస్టులు చేసే సామర్థ్యం వైరాలజీ ల్యాబ్‌కి ఉందన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో టెస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దేశవ్యాప్తంగా లక్షా 86 వేల కోవిడ్‌ బెడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 24 వేల ఐసియు బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్‌ కంపెనీల సహకారంతో వెంటిలేటర్లను తయారు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణకు 755 ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌-19 చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రత్యేకతలు….
కరోనా కట్టడికి మొబైల్‌ కంటైనర్‌ వైరాలజీ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. డీఆర్డీఓ అందించిన టెక్నాలజీతో మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఐకామ్‌ సంస్థ ఈ మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను తయారు చేసింది. ఈ ల్యాబ్‌ ప్రత్యేకతల గురించి ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి బీఎస్‌ఎల్‌3 కంటైనర్‌ ల్యాబ్‌ కావడం విశేషం. డి.ఆర్‌.డి.ఓ. ఇంజనీరింగ్‌ టెక్నాలజీ సహకారం దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులను అరికట్టడానికి వైద్య శాస్త్రవేత్తల బృందం భారత్‌లో మొట్టమొదటిసారి బహుళ ప్రయోజనకరమైన బీఎస్‌ఎల్‌ 3 అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మొబైల్‌ కంటైనర్‌ వైరాలజీ ల్యాబ్‌ ను సిద్ధం చేసింది. నిమ్స్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం అధిపతి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ మధు మోహన్‌ రావు మొబైల్‌ ల్యాబ్‌ ను రూపకల్పన చేశారు.
ఈఎస్‌ఐ వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ దీనికి సహకారం అందించారు. దీనిని త్వరలోనే ఈఎస్‌ఐ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. శాస్త్రవేత్తల బృందం డాక్టర్‌ వై శ్రీనివాస్‌, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, బి హెచ్‌ పి ఎస్‌ నారాయణ మూర్తి మొబైల్‌ కంటైనర్‌ ల్యాబ్‌ నిర్మాణానికి కావలసిన సాంకేతికతను అందించారు. ఈ సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఐకామ్‌ సంస్థ రెండు కంటైనర్లను ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. ఐ క్లీన్‌ అనే సంస్థ ఈ రెండు కంటైనర్ల తో బీఎస్‌ఎల్‌3 (బయో సేఫ్టీ 3) ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజులలో సిద్ధం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలలో బీఎస్‌ఎల్‌3 వైరాలజీ ప్రయోగశాలను సిద్ధం చేయడానికి సాధారణంగా అయితే ఆరు నెలల నుంచి ఏడు నెలలు పడుతుంది. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా ఈ సంస్థ యుద్ధప్రాతిపదికన కేవలం పదిహేను రోజుల్లోనే మొబైల్‌ ల్యాబ్‌ ను సిద్ధం చేసింది. సాధారణ వైరస్‌ ప్రయోగాల కోసం సాధారణ ప్రయోగశాల ఉంటే సరిపోతుంది. అయితే కోవిడ్‌ 19 వంటి ప్రాణాంతక వైరస్‌పై ప్రయోగాలు చేయాలంటే బీఎస్‌ఎల్‌3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాల తప్పనిసరి. బీఎస్‌ఎల్‌ 3 ప్రమాణాలు పాటించడం వల్ల ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలు సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. నిమ్స్‌ వైద్యశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మధు మోహన్‌ రావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు వైద్యులు ఈ ప్రయోగశాలలో విధులు నిర్వహిస్తారు. ల్యాబ్‌లో కోవిడ్‌ 19 వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అదేవిధంగా నియంత్రిత వాతావరణంలో వైరస్‌ను పెంచుతారు. వైరస్‌ను అరికట్టగల మందులను కనుగొనడానికి ప్రయోగాలు చేస్తారు. వైరస్‌ క్రమాన్ని అధ్యయనం చేసి వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తారు.
అమెరికా, యూరప్‌ తర్వాత మనమే…
అమెరికా, యూరప్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఇటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి. భారతదేశంలో బీఎస్‌ఎల్‌ 3 ప్రమాణాలతో మొబైల్‌ కంటైనర్‌ నిర్మించడం ఇదే మొదటిసారి. వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తల సహకారంతో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ సాధ్యమైంది. మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా కాకుండా అనేక ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పరిశోధనల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. అత్యవసరమైన పరిస్థితులను అవసరమైన ప్రదేశాలకు ఎక్కించి తరలించవచ్చు. అదేవిధంగా సైనిక అవసరాల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ ల్యాబ్‌ను అందుబాటులోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. వైరస్‌ క్రమాన్ని అధ్యయనం చేసి, వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇందులో విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక మైన టీమ్‌ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ వైరాలజీ ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments