తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం?
తాజాగా ఒకరు మృతి
రాష్ట్రంలో 943కి చేరిన కొవిడ్-19 కేసుల సంఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలినప్పటికీ, బుధవారం కేవలం 15 కేసులే నమోదు కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లుగా వారు అంచనా వేస్తున్నారు. తాజాగా నమోదైన 15 కేసులతో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 943కి పెరిగింది. అయితే బుధవారం ఒక కరోనా రోగి మరణించడం, ఏ ఒక్కరూ డిశ్చార్జి కాకపోవడం గమనార్హం. మరణాల సంఖ్య 24కి పెరగ్గా, వ్యాధి నుంచి కోలుకొని ఇప్పటివరకు 194 మంది ఇంటికి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇంకా 725 యాక్టివ్ కేసులు వున్నాయి. వీరంతా చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కేసులు వున్నాయి.