బల్దియాలో జోరుగా టెండర్ల ప్రక్రియ
అందరి దృష్టి కరోనాపై ఉండగా కొందరికి మాత్రం టెండర్లపైనే మక్కువ
సికింద్రాబాద్, ఎల్‌బినగర్ జోన్‌లలో ఇష్టారాజ్యం
అర్హత, అనుభవం లేకున్నా పనులు కట్టబెట్టిన వైనం
టెండర్ల ఖరారుపై సర్వత్రా అనుమానాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో సందేట్లో సడేమియాగా బల్దియాలో టెండర్ల ప్ర క్రియ జోరుగా సాగుతోంది. కొంతమంది అవినీతి అక్రమాలకు అలవాటు పడిన అధికారులు ఇదే అవకాశంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని సంస్థలకు ఇష్టారాజ్యంగా పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం అందరి దృష్టి కరోనా వ్యాప్తి నియంత్రణపై ఉండగా కొంతమంది మాత్రం టెండర్లపై మక్కువ చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల వరకు టెండర్లు ఆహ్వానించవద్దని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినా తోసిరాజని మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) జోనల్ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు ఆహ్వానించడంపై విమర్శలు వస్తున్నాయి. కరో నా నియంత్రణలో భాగంగా వివిధ శాఖల యంత్రాంగాలకు ప్రభుత్వం కొవిడ్- నియంత్రణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణం లో టెండర్లు ఆహ్వానించవద్దని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. లెబర్, వర్కర్స్, ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో అద్దె వాహనాలు, పారిశుద్ధ్యం తదితర అత్యవసర సేవలకు సంబంధించిన పనులకు మార్చి 31, ఏప్రిల్ 30లోపు కాలపరిమితి ముగియనున్న ఏజెన్సీలకు కొత్తగా టెండర్లను ఆహ్వానించవద్దని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్ధంగా జిహెచ్‌ఎంసిలో శానిటరీ పిల్డ్ అసిస్టెంట్‌లకు వేతనాలు చెల్లించే ఏజెన్సీలకు టెండర్లను ఆహ్వానించారు. మున్సిపల్ శాఖ ఉత్తర్వుల ప్రకారమైతే అసలు టెండర్లే ఆహ్వానించవద్దు. మున్సిపల్ శాఖ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ టెండర్లు ఆహ్వానించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎల్‌బినగర్‌లో ఇష్టారాజ్యం…
ఎస్‌ఎఫ్‌ఎ, కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించే ఏజెన్సీలకు సంబంధించి ఎల్‌బినగర్, సికింద్రాబాద్ జోన్‌లలో టెండర్లు ఆహ్వానించారు. ఇక్కడ అర్హతలేని ఏజెన్సీకి పనులు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018- సంవత్సరానికిగాను ఖైరతాబాద్, ఎల్‌బినగర్ జోన్‌లలో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించే పనులను 2018- సంవత్సరంలో దక్కించుకున్న సంస్థ అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించే పనులు దక్కించుకున్న సంస్థలు ఇఎస్‌ఐ, పిఎఫ్‌లను ఉద్యోగులు, కార్మికుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌లతో పాటు సరిగ్గా వేతనాలు చెల్లించకుండా ఎగవేసినట్లు కార్మికులు జోనల్ కమిషనర్, ఎస్‌ఇలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా ఆ సంస్థలకే తిరిగి పనులు అప్పగించడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సదరు సంస్థ నకికీ ధ్రువీకరణ పత్రాలు టెండర్‌లో దాఖలు చేసిందని, చార్మినార్ జోన్‌లో ఎస్‌ఇగా పనిచేసిన అధికారే ప్రస్తుతం ఎల్‌బినగర్‌లో టెండర్లు ఖరారు చేయడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్మికులు, ఉద్యోగులు ఫిర్యాదు చేసిన సదరు అధికారి ఆ సంస్థకు పనులు అప్పగించడం కొసమేరపు. ఇక టెక్నికల్, నాన్‌టెక్నికల్ పనులలో అనుభవం లేకున్నా పనులు అప్పగించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు పని అనుభవం లేకున్నా, ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్న సమయంలో హడావుడిగా టెండర్లను ఖరారు చేసి, సరైన ధ్రువపత్రాలు, అనుభవం లేని సంస్థలకు పనులు అప్పగించడం సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.