HomeNewsLatest Newsఆకలి కేకలు ఉండకూడదు

ఆకలి కేకలు ఉండకూడదు

కరోనా నిరోధానికి అనుసరిస్తున్న పద్ధతులు యథావిధిగా అమలు
అధికారులకు కెసిఆర్‌ ఆదేశం  
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో శనివారం సిఎం సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మున్సిపల్‌ శాఖమంత్రి కెటి రామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు శాంత కుమారి, నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు, కాళోడీ హెల్త్‌ యూనివర్సిటీ విసి కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. “దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి జరగుతూనే ఉంది. ఈ  నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. హైదరాబాద్‌ నగరంలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కంటైన్మెంట్ల నిర్వహణ బాగా జరగాలి. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయవద్దు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకోవాలి. వైరస్‌ సోకిన వారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను కచ్చితంగా నిర్ధారించి పరీక్షలు జరపాలి. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ముఖ్యమంత్రి చెప్పారు. “లాక్‌ డౌన్‌ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు. అందుకే ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డుదారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. వలస కూలీలు, రోజు వారి కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలి. వ్యవసాయ కార్యక్రమాలు యధావిధిగా జరిగేట్లు చూడాలి. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి” అని సిఎం సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments