పాతబస్తీలో డాక్టర్, నర్సుకు పాజిటివ్?
ముషీరాబాద్‌లో పాజిటివ్ కేసు నమోదు!
ప్రజాపక్షం/హైదరాబాద్: హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు నగరంలో భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉన్న సమాచారం ప్రకారం 706 కేసుల్లో సగం కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదైనవే ఉండడం గమనార్హం. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో మర్కజ్ లింకు ఉన్నవే అధికం. తాజాగా పాతబస్తీలో డాక్టర్‌కు, నర్సుకు, ముషీరాబాద్‌లో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు నగరంలో కలకలం రేగింది. హైదరాబాద్ పాతబస్తీలోని తలాబ్‌కట్ట ప్రాంతంలో ఓ మహిళ కరోనా వైరస్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యంపాలైన ఆమెను వైద్యం కోసం అంతకుముందే పలు ఆస్పత్రుల చుట్టూ కటుంబసభ్యులు తిప్పారు. ఆమె మృతి చెందిన తరువాత కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ కుటుంబంలోని 17 మందికి పాజిటివ్ వచ్చింది. పాతబస్తీలో ఓ డాక్టర్, నర్సుకు కూడా కరోనా పాజిటివ్ అని శుక్రవారం తేలడంతో నగరంలో కలకలం రేగింది. తలాబ్‌కట్టకు చెందిన ఆ మహిళకు ఈ వైద్యుడు, నర్సు చికిత్స చేసినట్లు సమాచారం. మరోవైపు ఆ మహిళ కుటుంబానికి చెందిన 17 మందికి చికిత్స కొనసాగుతుండగా మహిళకు చికిత్స చేసిన వారందరినీ అధికారులు క్వారంటైన్‌లో పెట్టినట్లు సమాచారం. మరోపక్క ముషీరాబాద్‌లో పాలు విక్రయించే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ సోకిన వ్యక్తితో సుమారు పది మంది వరకు సంబంధాలు కలిగి ఉండడంతో వారందరినీ అధికారులు క్వారంటైన్‌కి తరలించినట్లు తెలుస్తోంది. తాజా ఈ రెండు ఘటనలతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందారు.