యుపి సిఎంకు లేఖ రాసిన ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా
ప్రజాపక్షం/హైదరాబాద్: ‘ది వైర్’ న్యూస్ వెబ్సైట్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయ డం పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, బెదిరిండచంతో పాటు ప్రముఖ జర్నలిస్టు ప్రతిష్ఠను దిగజర్చడమే అవుతుందని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. అయోధ్యలో యుపి ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడంపై మార్చి 25న ‘ది వైర్’లో వార్తా కథనాన్ని ప్రచురించారు. ఇందుకు ఆయనపై యుపి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘స్వయంగా ప్రధాని ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడంపై ఐపిసి 188 సెక్షన్ (ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన) కింద మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదని’ యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ కె.సహాయ్, సెక్రటరీ జనరల్ అనంద్ బగైత్కర్ ప్రశ్నించారు. ఈ లేఖ ప్రతులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రికి కూడా పంపారు. సిద్ధార్థ వరదరాజన్‌పై మోపిన అభియోగాలు తప్పుడువని, అసంబద్ధమైనవే కాకుండా ఉద్దేశపూర్వకంగా చేసినట్లున్నాయని అందులో పేర్కొన్నారు. ‘యుపి ప్రభుత్వం, యుపి పోలీసులు ఆందోళకరమైన చర్యల ద్వారా మీడియా తన పని చేసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్నట్లు కనపడుతోంది. అత్యంత గౌరవింపబడే సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ వరదరాజన్ విషయంలో అణచివేయడం, బెదిరించడమనే ద్వం ద్వ ఉద్దేశ్యాలు కనిపిస్తున్నాయి. మార్చి 24వ తేదీ సాయంత్రం ప్రధాని దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఇచ్చిన ఆదేశాలను మార్చి 25న అయోధ్యలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉల్లంఘించారంటూ ‘ది వైర్’లో వాస్తవాల ఆధారంగా కథనం ప్రచురితమైంది. అందులో ఆయనకు సంబంధించి కొన్ని అవాస్తవ వ్యాఖ్యలు వచ్చిన, వెంటనే సరిచేశారు. ఉల్లంఘన విష యం పత్రికల్లో, టివిల్లో కూడా వార్త వచ్చింది. ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీలోని వరదరాజన్ నివాసానికి కొంతమంది యుపి పోలీసులు వచ్చి, ఏప్రిల్ 14వ తేదీన అక్కడికి 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్య రావాలని నోటీసు ఇచ్చారని, ఇదంతా కూడా లాక్డౌన్ కొనసాగుతుండగానే జరిగింది. మీ యంత్రాంగం ప్రోత్సాహం లేకుండా యుపి పోలీసులు కేసు పెట్టడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిని అవమానించారని, వర్గాల మధ్య ద్వేషం రెచ్చగొట్టారని, ప్రజల్లో అశాంతికి కారణమయ్యారనే కారణాలు చూపుతూ క్రిమినల్ ‘లా’లో ఆరు సెక్షన్లు నమోదు చేశారు. అతి పెద్ద రాష్ట్రానికి ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు, యుపిలో అత్యునత పదవిలో ఉన్న మీరు (సిఎం ఆదిత్యనాథ్) జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారనే ప్రశ్నకు ఐపిసి సెక్షన్ 188 కింద సమాధానమివ్వాల్సి ఉంది. రాష్ట్రాలలో పత్రికా స్వేచ్ఛను తేలికగా తీసుకోవద్దని మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రధానమంత్రి, హోంమంత్రులను కోరుతున్నాం. ప్రస్తుత సం క్షుభిత సమయంలో మహమ్మారిపై పోరాడేందుకు స్వతంత్ర మీడియా పాత్ర కీలకమని వారే చెప్పారని, అందుకు సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామ’ని లేఖలో పేర్కొన్నారు.