లాక్‌డౌన్‌తో ఆహారం లభించక నీరసిస్తున్న వైనం
న్యూఢిల్లీ: కరోనా పిడుగు ప్రతి ఒక్కరి జీవితాలను కకావికలం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ విధించడంతో చేసేందుకు పనిలేక, తమ స్వస్థలాలకు వెళ్లేందు కు మార్గంలేక వలస కార్మికులు ఒకపక్క సతమతమవుతూ మరోపక్క సొంతూళ్లలో ఉన్న తమ వారు ఎలా ఉన్నారోనన్న బెంగ వారిని మరింత కుంగదీస్తోంది. ఇక వీధి బాలలకు తిండి దొరక్క కడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ విధించడం వల్ల సకలం మూసివేయడంతో ఆహారం దొరికే మార్గంలేక అన్నమో రామచంద్రా.. అంటూ నీరసించిపోతున్నారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి సరైన తిండి దొరకడం లేదని తమ గోడువు వెల్లబోసుకుంటున్నారు. తాను తిండి తనక మూడు రోజులు అవుతుందని, ఒకవేళ ఆహారం లేకపోతే తనకు, తన ముగ్గురు తోబుట్టువులకు కనీసం మంచినీటిని అయినా సమకూర్చాలని 11 ఏళ్ల ఓ బాలుడు చేతిలెత్తి సమస్కరిస్తూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు వీధి బాలల కోసం పని చేస్తున్న ఎన్‌జిఒ ‘చెట్నా’ (చైల్డ్‌హుడ్ ఎన్‌హాన్స్‌మెంట్ త్రో ట్రైనింగ్ అండ్ యాక్షన్)కు వీడియో సందేశం పంపాడు. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ఇలాంటి సందేశాలు అనేకం తమకు అందాయని చెట్నా డైరెక్టర్ సంజయ్ గుప్తా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని 130 కోట్ల ్ర-పజలకు విజ్ఞప్తి చేస్తూ దేశం చరిత్రలోనే ఎప్పుడూ లేన విధంగా పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌ను కేంద్రం విధించింది. భారత్‌లో ఇప్పటి వరకు 11 వేలకుపైగా మందికి వైరస్ సోకగా, 377 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజల రాకపోకలపై పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది. అత్యవసరం కాని అన్ని రకాల వాటిపై ఆంక్షలు విధించింది. ప్రజలంతా స్వతహాగా క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించింది. అయితే స్వీయ నిర్బంధం విలాసంతో కూడుకున్నది, అది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బెలూన్లు, పెన్నులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వీధి బాలలకు ఏ మాత్రం వీలు పడదు. జనాభా లెక్కల్లో చేర్చని వీధి బాలల అనేకం ఉన్నారని, వీరికి ఎలాంటి ఆదాయం లేదని, పూర్తిగా ఇతరుల సహాయం మీదనే ఆధారపడతారని చెట్నా డైరెక్టర్ గుప్తా పేర్కొన్నారు. మొదటిసారిగా లాక్‌డౌన్ విధించన మొదటి మూడు రోజుల్లో తాము ఆకలితో అలమటిస్తున్నామని దుఃఖిస్తూ అనేక సందేశాలు పంపారన్నారు. సాయం చేయాలని ఏడుస్తూ తమను సంప్రదించారని, తాము ఏమీ తినలేదని గోడు వెళ్లబోసుకున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగి వారి కోసం హెల్పలైన్ నంబర్‌ను ప్రారంభించిందన్నారు. అయితే తమకు సాయం చేయాలని లక్నో, గజియాబాద్, ఢిల్లీ నుంచి వీడియో సందేశాలు వచ్చాయన్నారు.