HomeOpinionArticlesగిట్టుబాటు లేని  బత్తాయి

గిట్టుబాటు లేని  బత్తాయి

లాక్‌డౌన్‌తో మందగించిన కొనుగోళ్లు
లాక్‌డౌన్‌ ముగిశాక  రైతుల వద్ద నుండి కొనుగోలుకు ప్రభుత్వం హామీ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఆరుగాలం కష్టించి పండించిన బత్తాయి పంట కు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు రావడం లేదు. దీంతో కేవలం పది రూపాయలకే  నాలుగైదు పండ్లు వినియోగదారులకు విక్రయించాల్సి వస్తోంది. బత్తాయి పంట పండించే రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం మరో పక్క హామీ ఇస్తున్నా.. అది ఆచరణ రూపుదాల్చడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. కరోనా వైరస్‌ విస్తరించిన క్రమంలో  ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. పండించిన బత్తాయిని తరలించేందుకు, అలాగే మా ర్కెట్లలో విక్రయించేందుకు యత్నిస్తున్నా వినియోగదారులు లేక వెలవెల పోతున్నాయి. హైదరాబాద్‌ వంటి చోట్ల  రూ. 50కే ఒక బస్తా ను కొనుగోలు చేసి పేదలు, అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తోపుడుబండ్ల వాళ్లు విక్రయాలకు పెట్టుకుంటున్నా కొనేవారు లేక వారు నేల చూపులు చూస్తున్నారు. బత్తాయి పంట సాగు చేస్తున్నరైతులు మాత్రం టన్నుకు రూ. 50 వేలు విక్రయిస్తేనే గానీ తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌తో పాటు గుడిమల్కాపూర్‌, కొత్తపేట పండ్ల మార్కెట్లలో కుప్పలు కుప్పలుగా ఈ ఏడాది బత్తాయి పంట సరుకు వచ్చి పడింది. లాక్‌డౌన్‌తో ప్రజలు కొనుగోలు చేసేందుకు వస్తారో? రారోనన్న సందేహాల మధ్యే కొద్ది మొత్తంలోనే  చిరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా రూ. 100కు ఒక  బస్తా లెక్కనే.
ఇప్పటితో పోలిస్తే గతేడాదే నయం!
గత ఏడాది ఇదే ఏప్రిల్‌ నెలలో టన్ను బత్తాయిలకు తోటల దగ్గరనే దళారులకు రూ. 40 వేలకు విక్రయించారు. మే మొదటి వారంలో టన్నుకు రూ. 50 వేలకు విక్రయాలు జరిగాయి. కానీ ఈ ఏడాది మార్చి నెలలో టన్నుకు రూ. 15 వేలు మాత్రమే పలికింది. గత నెల చివరి వారంలో హైదరాబాద్‌ కొత్తపేట పండ్ల మార్కెట్‌కు  ఒక రోజు నాలుగైదు టన్నుల బత్తాయిలు తీసుకెళ్లిన రైతులకు టన్నుకు రూ. 90 వేల నుంచి రూ. 38 వేల వరకు ధర పలికింది. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా టన్ను ధర రూ. 25 వేల నుంచి 20 వేలకు పడి పోయింది. గడచిన వారం రోజులుగా కొత్త పేట మార్కెట్‌లో టన్ను బత్తాయికి రూ. 10 వేల నుండి 12 వేలకు మించి రావడం లేదని బత్తాయి రైతులు తెలియజేస్తున్నారు. బత్తాయి  పంట విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో గిట్టుబాటుధరల కంటే ఎక్కువగానే వస్తాయని ఆశించామని, లాక్‌డౌన్‌ ఇలా తమను ఆర్థికంగా నష్టపరుస్తుందని అనుకోలేదని మెదక్‌ జిల్లాకు చెందిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటికేడాది పెట్టుబడులు పెడుతున్నా,  కూలీల ఖర్చులు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ట్రాక్టర్‌ కిరాయిలు వంటి వాటి నన్నింటినీ లెక్క తీస్తే ఖర్చులన్నీ బాగా పెరిగాయని చెబుతున్నారు.
లాక్‌డౌన్‌  ఎత్తేశాకే సర్కార్‌ కొనుగోళ్లు !
కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగించిన విషయం తెలిసిందే. మే 3 తర్వాతే రైతుల వద్ద నుండి బత్తాయి పంటకొనుగోళ్లు చేయిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బస్సులు, రైళ్లు , లారీల రాక పోకలు సాధారణ పరిస్థితికి రావాలని, అప్పుడే సరుకు రవాణాకు మార్గం సులువు అవుతుందని  మార్కెటింగ్‌ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. బత్తాయి ఇతర జిల్లాల కంటే కూడా నల్లగొండ జిల్లాలో విస్తారంగా సాగు అవుతోంది. నల్లగొండ తర్వాత రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ పంటను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక  పరిస్థితులను బట్టి ప్రభుత్వం రైతుల వద్ద నుండి బత్తాయి పంటను మార్కెటింగ్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు ఈ విషయంలో దిగాలు పడొద్దంటూ ఆ జిల్లా మంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. బత్తాయి మనిషికి ఆరోగ్య ప్రదాయిని అని , ఈ పంట విక్రయాలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments