HomeNewsLatest News12 గంటల విధానానికి వ్యతిరేకం

12 గంటల విధానానికి వ్యతిరేకం

స్పష్టం చేసిన 11 కేంద్ర కార్మిక సంఘాలు
కేంద్ర కార్మికశాఖమంత్రి గంగ్వార్‌కు లేఖ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ప్రస్తుతం కొనసాగుతున్న రోజుకు ఎనిమిది గంటల పనివిధానానికి బదులుగా 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చేలా ఫ్యాక్టరీల చట్టం- సవరించే ఎలాంటి ప్రయత్నాలనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌కు 11  కేంద్ర కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. వారంలో 48 గంటల పనిగంటల స్థానంలో 72 గంటలు తీసుకురావడం, కొవిడ్‌ పేరుతో ఇపిఎఫ్‌ఒ, ఇఎస్‌ఐ వనరులను మళ్ళించడం వంటి చర్యలు మంచివి కాదన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గంగ్వార్‌కు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, టియుసిసి, సేవా, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌, యుటిసి11 కేంద్ర కార్మిక సంఘాలు  సోమవారం నాడు లేఖ రాశాయి. ఈ విషయాన్ని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యల పేరుతో పనిగంటలు పెంచే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు, అలాగే  ఇపిఎఫ్‌ఒ నిధులను ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనకు రూ.4800 కోట్లు మళ్ళిస్తున్నట్లు,  ఇఎస్‌ఐ నిధులను ప్రభుత్వ ఖర్చులకు మళ్ళిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పష్టతనివ్వాలని కార్మిక మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. ఒకవైపు కార్మికులు ఉద్యోగాలు, జీవనభృతిని కోల్పోతున్న సమయంలో పని గంటలు పెంచడమంటే కార్పొరేట్‌లకు అధిక లాభాలు  కల్పించేందుకేనని భావించాల్సి వస్తుందని  విమర్శించారు.  ఇపిఎఫ్‌ఒ, ఇఎస్‌ఐ నిధులు పూర్తిగా పేద కార్మికులకు సంబంధించిన  నిధులు అని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని మళ్ళించవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ సంపదలో 50 శాతం తమ గుప్పిట్లో పెట్టుకున్న బడా ధనవంతుల నుండి అసాధారణ పరిస్థితుల దృష్ట్యా నిధులు సమీకరించాలే తప్ప జీవితాంతం కష్టపడి జమ చేసిన పేదల నిధుల నుండి కాదని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments