ప్రజాపక్షం/హైదరాబాద్: కరోనా ప్రభావిత దేశాల నుండి ప్రవాస భారతీయులను తీసుకొచ్చిన విధంగానే మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులను స్వంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇతర ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులు కరోనా ప్రభావంతో కళాశాలలను మూసివేయడం, హాస్టళ్ళలో నిబంధనలు కఠినతరం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వలస కూలీలు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్నారని, ఇప్పుడు పనులు లేక , తినడానికి తిండి లేక, తమ సొంత ప్రాంతాలకు పోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు దూరంగా ఉండి బిక్కుబిక్కున కాలం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం తమ సొంత ప్రాంతాలకు కూడా వెళ్లడానికి అవకాశం, రవానా సౌకర్యం లేదని తెలిపారు. గతంలో 21 రోజుల లాక్‌డౌన్ అన్నారని, దానిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నారని తెలిపారు. దీంతో అనేక మంది కాలినడకన సుదూర ప్రాంతాలకు ప్రయాణమవుతున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను, వలస కూలీలను, ఉద్యోగులను తమ సొంత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.
చెంచులకు ప్రభుత్వ సాయం
సిఎం కెసిఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్: నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని చెంచుపెంటలకు ప్రభుత్వ సాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు సోమవారం లేఖ రాశారు. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదిర మండలాల పరిధిలో రహదారికి దాదాపు 10 నుడి 40 కిలో మీటర్ల దూరంలో నల్లమల రిజర్వు అటవీ ప్రాంతంలో ఉండే పుల్లాయిపల్లి, యుపాయింట్, అప్పాపూర్, బౌరాపురం, మేడిమల్కాల్, సంగిడిగుండాల్, పందిగోరె, జిజ్‌గండి, సార్లపల్లి, కుడిచింతబైల్ పెంటల్లో చెంచులు నివసిస్తున్నారని తెలిపారు. వీరు నివసించే ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నివారించడానికి లాక్‌డౌన్ ప్రకటించినందువల్ల పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు వీరికి ఇప్పటి వరకు అందలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వీరికి బియ్యం, నగదు సంబంధిత అధికారుల ద్వారా కానీ లేదా ఐటిఎడి ద్వారా కానీ పంపిణీ చేయించాలని సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వీరిలో చాలా మంది నిరక్ష్యరాస్యులని, మైదాన ప్రాంతాల్లోకి వచ్చి బ్యాంకు అకౌంటులు నిర్వహించడం వీరికి తెలియదని, వీరికి బ్యాంకు అకౌంట్లు కూడా లేవని, అందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ప్రకటించిన నగదు సహాయం కూడా వారికి ఇళ్ల వద్దనే అందించే ఏర్పాటు చేయించాలని కోరారు. అలాగే వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్స్‌కు రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని, సంచార అంబులెన్సు ద్వారా వీరికి వైద్య సేవలు అందించాలని సూచించారు.