మర్రిచెట్టుకు ఉరి వేసుకున్న యువతులు
నేలపై ఓ మృతదేహం
హత్యా!.. ఆత్మహత్యా.. కోణంలో దర్యాప్తు
ప్రజాపక్షం/జవహర్‌నగర్ : కరోనా విజృంభిస్తున్న వేళ మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న మర్రిచెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు, ఒక బాలిక మృత దేహాలు లభ్యమైన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎసిపి శివకుమార్, సిఐ భిక్షపతిరావులు తెలిపిన వివరాలు ప్రకారం అక్కడ లభించిన సెల్ ఫోన్ ఆధారంగా ఆరా తీయగా కరోనా నేపథ్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడానికి వెళ్లిన వీరు ఇంటికి ఆలస్యంగా రావడంతో వారిద్దరి భర్తలతో గొడవపడి కరీంనగర్ నుంచి శామీర్‌పేటకు చేరుకున్నారు. వారికి తెసిన ఒక పాస్టర్కు ఫోన్ చేయగా జవహర్‌నగర్‌లో ఆశ్రయం ఇచ్చినట్లుగా వారు తెలిపారు. వీరిలో ఒకరు నాయీ బ్రాహ్మణ, మరొకరు ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వారీగా తెలుసుకున్నారు. మృతులు ముగ్గురిని సుమతి, అనూష, పాప ఉమామహేశ్వరిగా గుర్తించారు. ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు వీరు ఇంటి నుంచి బయటకు వచ్చి పాపకు కూల్‌డ్రింక్‌లో హార్పిక్, ఆలౌట్ తాగించి, గొంతు నులిమి చంపి, ఆ తర్వాత ఇద్దరు యువతులు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. లేకుంటే మరెవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.