టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ కార్యకర్తలకు చాడ వెంకటరెడ్డి పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని సిపిఐ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. లాక్డౌన్ పరిస్థితులపై ఆయన శనివారం పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా తెలంగాణలో సిపిఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించి బియ్యం, పప్పులు, నూనె తదితర సామగ్రి పంచిన వారికి అభినందనలు తెలిపారు. చైనాలో కరోనా పుట్టినా దానిని అరికట్టడంలో చైనా సఫలమైందని, ప్రపంచ అధిపతిగా భావించే అమెరికా మాత్రం ఘోరంగా విఫలమైందన్నారు. చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో కరోనా విజృంభించిన తర్వాత భారత ప్రభుత్వం ఇంకొంత ముందుగా స్పందించి ఉంటే దేశంలో ఇంకా ఎక్కువగా కరోనా కట్టడి జరిగేదని అభిప్రాయపడ్డారు. మర్కజ్ నిజాముద్దీన్ ప్రారంభ సమావేశాల రోజే ప్రధాని మాట్లాడుతూ కరోనా గురించి మన దేశంలో అంత ప్రమాదం లేదని స్వయంగా ప్రకటించి ఇప్పుడు మర్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చిన వారి వల్లే కరోనా ప్రబలిందనడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో, దేశంలో లాక్డౌన్ ప్రకటించే ముందు లక్షలాది వలస కార్మికుల గురించి ఆలోచించి ఉంటే వారికి ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. గ్రామీణ, పట్టణ
దినసరి కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, చేతివృత్తుల వారు, రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది మంది గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించి వారికి సహాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యం, రూ.1500 అందరికీ సరిగ్గా అందడం లేదని, అవి అందరికీ అందేలా స్థానిక అధికారులతో మాట్లాడి బాధితులకు అందేలా చూడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తెల్లకార్డులు లేని పేదలకు, వలస కార్మికులు, నిరాశ్రయులకు సహాయం అందేలా చూడాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు కట్టుకొని చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డబ్బు, రేషన్ సరిగ్గా అందడం లేదని బాలాపూర్ మండలం, సంగారెడ్డి, మెదక్ ల నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదులు రాగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామని హామినిచ్చారు. లాక్డౌన్ ఇంకా పొడిగించే అవసరం ఉందని, పొడిగించే పరిస్థితి వస్తే ఖర్చుల కోసం ఇచ్చే నగదు ఐదువేలకు పెంచాలని, 25 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి కోవిడ్ ఎదుర్కోవడంలో అందరిని భాగస్వామ్యం చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.