అంతటా తక్కువ మరణాల రేటు
దేశానికి ఆదర్శంగా కేరళ నమూనా
అమెరికాకు రక్షణ సూట్లు పంపిన వియత్నాం
ఆపదలో ఉన్న దేశాలకు వై ద్యులను పంపుతున్న క్యూబా
ప్రజాపక్షం/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు నెలవైన చోట కరోనా వైరస్‌ను నియ ంత్రించడంలో ముందంజలో ఉన్నాయి. వియత్నాం, క్యూబా, చైనా, తదితర కమ్యూనిస్టు దేశాల్లో కరోనా వ్యాపిని అడ్డుకోవడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న దేశాలు, రాష్ట్రాలలో వ్యాధి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవడమే కాకుండా, మరణాల రేటు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉండడం విశేషం. భారతదేశంలో కేరళ రాష్ట్రం అవలంభిస్తున్న నమూనా యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మొత్తమ్మీద కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట్ల ప్రభుత్వాలు ముందే మేల్కొనడమే కాకుండా, లాక్‌డౌన్‌లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలను, ఆహారాన్ని అందుబాటులో ఉంచాయి. అంతే కాకుండా ఆపదలో ఉన్న ఇతర దేశాలకు కూడా ఆపన్న హస్తాన్ని అందించడం విశేషం. కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థే కోవిడ్-19పై పోరులో ఇతరులకంటే ముందుండేలా చేసింది.
ఆదర్శ కేరళ
మన దేశంలో తొలి కరోనా వైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. జనవరి 30న వూహాన్ నుండి వచ్చిన విద్యార్ధుల్లో తొలి కరోనా కేసు ఈ రాష్ట్రంలోనే నమోదైంది. ఆ వెంటనే అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర సంఘతన (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం అలర్డ్ అయింది. గతంలో నిపా వైరస్‌ను ఎదుర్కొన్న అనుభవాన్ని రంగరించి, ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నది. ఆపద సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతను కలుపుకొని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సమీక్షా సమావేశం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వం ద రోజుల్లో మొత్తం 364 కరోనా కేసులు నమోదవగా, కేవలం ముగ్గుర మాత్రమే మరణించగా,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 238 మంది చికిత్స పొం దుతున్నారు. 92 ఏళ్ళ వ్యక్తి, ఆయన సతీమణి 88 ఏళ్ళ మహిళ కోవిడ్ నుండి కోలుకున్న వారిలో ఉండడం విశే షం. కోవిడ్ కేసుల్లో తక్కువ మరణాల రేటు ఉన్న రాష్ట్రం గా కేరళ అగ్రస్థానంలో ఉన్నది. దేశం అప్రమత్తం కాకముందే రూ.20వేల కోట్లతో కరోనా రిలీఫ్ ప్యాకేజీని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఎవ్వరూ ఆకలికి బాధపడొద్దని ఇంటి గడప వద్దకే సబ్బులు సహా 17 నిత్యావసరవస్తువుల ప్యాక్‌ను ప్రభుత్వం పంపించింది.అలాగే వెయ్యి క్యాంటీన్‌ల ద్వారా భోజన సదుపాయం కల్పించారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ఇబ్బందుల పాలవుతు న్న వలస కార్మికుల కోసం 22,500 శిబిరాలు ఏర్పాటు చేస్తే, ఒక్క కేరళలోనే అందులో 70 శాతం అంటే 15,500 శిబిరాలు ఏర్పాటు చేశారు.అందులో మూడులక్షల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ముప్పు ఏళ్ల వామపక్ష పాలనలో ప్రజారోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధ దృష్ట్యానే నేడు కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కమ్ముకొచ్చిన సమయంలో తెలంగాణ ప్రభు త్వం సైతం అధికారులను కేరళ పంపి అధ్యయనం చేయించింది.
వియత్నాం జీరో మరణాలు, అమెరికాకు సాయం
చైనా సరిహద్దుగా ఉన్న వియత్నాంలో కమ్యూనిస్టు ప్రభు త్వం కరోనాను కట్టడి చేయడంలో ముందుంది. ఇప్పటి వరకు 258 కరోనా కేసులు నమోదవగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థే ఇందుకు కారణం. అక్కడ సామాజిక దూరం పాటించడంతో పాటు ముందుజాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అమలు చేశారు. సుమారు లక్ష మంది వైద్యులు, అంతకంటే ఎక్కువ మంది నర్సిం గ్ సిబ్బందిని కరోనాపై పోరుకు దింపి, ఇప్పటి వరకైతే నిలవరించగలిగింది. ఒకప్పుడు అమెరికాతో గెరిల్లా యుద్ధంలో గెలిచిన వియత్నాం, ఇప్పుడు కష్ట కాలంలో అమెరికాకే 4.50 లక్షల రక్షణ సూట్లను పంపడం విశే షం. అంతే కాకుండా మనవతా దృక్ఫదంతో లావోస్, స్పెయిన్‌లకు కూడా వైద్య సహాయం అందించింది. ఐరోపా దేశాలకు ఐదు లక్షల మాస్కులను పంపింది.
క్యూబా వైద్యులకు జేజేలు
నిత్యం అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటూ స్వయం సత్తాక దేశంగా ఎదిగిన కమ్యూనిస్టు దేశం క్యూబా కోవిడ్ పోరులో ప్రపంచ దేశాలకు సాయం అందిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నది.పలు దేశాలు వైద్యులు సరిపోక సతమతమవుతుంటే, ఇప్పటికే క్యూబాలో 564 మందికి కరోనా సోకినా కూడా వెరవకుండా 59 దేశాలకు తమ వైద్య బృందాలను పంపించింది. తనను కాదన్న దేశాలకూ కూడా వైద్యులను పంపుతూ పంతం కంటే మనిషే ముఖ్యమని చాటుకున్నది. కరోనాతో అతలాకుతలమవుతున్న స్పెయన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలకు తమ వైద్యులను పంపి శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి గ్రస్తులకు చికిత్స చేస్తున్నారు. ఇటలీలో కరోనాకు మూల కేంద్రంగా ఉన్న లాంబోర్జీ ప్రాంతానికి వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలోనే 53 మంది అంటువ్యాధుల నిపుణులైన వైద్యులను క్యూబా పంపి, విలువైన సేవలను అందించి ప్రశంసలు పొందింది.
లాక్‌డౌన్ సూత్రాన్ని అందించిన చైనా
మరోవైపు కరోనా జాడ తొలుత చూసిన చైనాలో కూడా మరణాల రేటు తక్కువగా ఉంది. పది రోజుల్లో పెద్ద ఆసుపత్రిని నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సుమారు 82 వేల మందికి కోవిడ్ సోకగా 3,300 మందికి పైగా మరణించారు.
ప్రస్తుతం కోవిడ్ ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ అత్యంత ముఖ్యమైన ఆయుధమని తాను స్వయంగా ఆచరించి, ప్రపంచానికి నమూనాగా అందించింది. చైనాలో వూహాన్ నగరం ఉన్న ప్రావిన్స్ మినహా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా సామాజిక దూరం, లాక్‌డౌన్‌లను పాటించింది.