వెలుగుచూస్తున్న కరోనా పాజిటివ్ కేసులు
దేశవ్యాప్తంగా 200 హాట్‌స్పాట్ ప్రాంతాలు.. 150 రెడ్‌జోన్స్
హైదరాబాద్‌లో 12 హాట్స్పాట్లను కంటోన్మెంట్ ప్రాంతాలుగా గుర్తింపు
గురువారం నుంచి పూర్తిగా నిషేధాజ్ఞలు
బారికేడ్లతో దారులన్నీ మూసివేత
అత్యవసర సేవల వారికి అనుమతి
ప్రతి రెండు రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు
నిర్మల్‌లో 5, నిజామాబాద్‌లో 8, పెద్దపల్లిలో 2 కొత్త పాజిటివ్ కేసులు
తాజాగా దుబాయ్ వెళ్లివచ్చిన వారిలో బయటపడుతున్న కరోనా
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో తాజాగా పల్లెలు గుబులు పుట్టిస్తున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా గురువారం నిర్మల్ జిల్లాల్లో మరో రెండు గ్రామాల్లో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. పట్టణాలు, నగరాలనే కాకుండా గ్రామాలకు కూడా కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వ వర్గాల్లో కాస్తా ఆందోళన మొదలైంది. గురువారం నిర్మల్ జిల్లా నర్సాపూర్, చాక్పల్లి గ్రామాల్లో ఒక్కోటి చొప్పున పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చాందతో పాటు కడెం మండలం పెంబిలోనూ కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించారు. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆయా గ్రామాలను దిగ్భందం చేస్తూనే సమీప గ్రామాలలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో నిషేధాజ్ఞలు విధించి వైద్యపరీక్షలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇప్పటికి కొంత ఆందోళన కరంగానే కనిపిస్తోంది. బుధవారం రాష్ట్రంలో 49 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం 543కి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 200 హాట్‌స్పాట్ ప్రాంతాలను ప్రకటించగా హైదరాబాద్‌లో 12 ప్రాంతాలను గుర్తించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించింది. రాష్ట్రంలో దాదాపు సగం కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కావడంతో గురువారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. బారికేడ్లు పెట్టి దారులు మూసి అత్యవసరవ సేవలందించే వారిని పాస్‌లు చూసి పంపిస్తున్నారు. ప్రజలను ఎవరిని కూడా గడపదాటి బయటకు రానీయడం లేదు. ఇద్దరు డాక్టర్లతో కూడిన బృందంతో ఈ ప్రాంతాలలో వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. లాక్డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాత బస్తీలో ఉల్లంఘించిన 30 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిబంధనల మేరకు తమ నివాస ప్రాంతం నుంచి 3కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెల్లే వాహన దారులను గుర్తించేందుకు కొత్త ఎఎన్ఆర్సి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. వాహనం నెంబర్ ఆధారంగా అది ఆరోజు ఎంత దూరం ప్రయాణించిందో తెలుపుతుంది. దీంతో ఆనెంబర్లకు జరిమానా, వాహనదారులకు శిక్షలు విధించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా కంటోన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిలో కూడా ఇవే చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లో బుధవారమే ఈ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఇప్పటి వరకు ఉన్న 343 పాజిటివ్ కేసుల్లో 200 మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారివి కాగా మరో 100 వారి సన్నిహితంగా మెదిలిన వారు, కుటుంబ సభ్యులవే. దీంతో మర్కజ్ వెల్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించి వారిలో 3157 మందిని 167 కేంద్రాలలో క్వారంటైన్ చేశారు. తాజాగా నిర్మల్ జిల్లాలో కొత్తగా వెలుగు చూసిన 5 పాజటివ్ కేసుల్లో నాలుగు మర్కజ్ వెల్లి వచ్చిన వారివి కాగా ఒకరు దుబాయ్ వెల్లి వచ్చిన వ్యక్తిది. దీంతో నిర్మల్ జిల్లాలో కరోఎనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 15కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిన వారి విషయంలో ఆదిలాబాద్, నిర్మల్‌లు మొదట ముందు స్థానంలో లేనప్పటికి తాజాగా వెలుగుచూస్తున్న కేసులతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారివే కేసులు వెలుగుచూస్తుండడం దీనికి కారణం. ఆదిలాబాద్‌లో 76 మంది మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారిని గుర్తించగా వారిలో ఇప్పటి వరకు పది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గురువారం కొత్తగా రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటితో గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సూర్యాపేటలోని కంటోన్మెంట్ ప్రాంతాలలో ఇంటింటికి సరుకులు, మందులు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడం మందగించింది. గురువారం సాయంత్రం వరకు ఒక్క కాకినాడలో మాత్రమే ఒక్క పాజిటివ్ కేసు నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని ఆంక్షలను విధించారు. జాతీయరహాదారులకు సమీపంలో ఉన్న గ్రామాలకు దారులు మూసివేశారు. వైద్య, దాని అనుబంధ విద్యార్థులను వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆహ్వానించారు. ఇలా ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాలలో మెడికల్ దుకాణాలతో పాటు అన్నింటిని మూసివేశారు. ఈ ప్రాంతాలలో ఎలాంటి వెసులుబాటు లేకుండా దాదాపు కర్ఫ్యూ విధించినంత పనిచేశారు. అనంతపురంలో కరోనా బాదితులకు చికిత్స అందిస్తున్న ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. గుంటూరు పట్టణాన్ని పూర్తిగా దిగ్భందనం చేశారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే పంజాబ్, ఒడిషా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడగించగా ఒడిషాలో విద్యాసంస్థలకు జూన్ 17 వరకు సెలవులు ప్రకటించింది. తెలంగాణ సరిహద్దుల్లో క్వారంటైన్లో ఉన్న 35 మందిని ఏపికి తరలించారు. పంజాబ్ బాటలో ఒడిషాలోనూ మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1297 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీటిలో దాదాపు 900 కేసులు ఒక్క ముంబైలోనే ఉన్నాయి. ముంబాయిలో 397 ప్రాంతాలను బిఎంసి కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేశంలో ఇప్పటి వరకు 5954 పాజిటివ్ కేసులు నమోదు కాగా 186 మంది మరణించారు.