149 మరణాలు, ఒకే రోజు 485 కేసులు నమోదు
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ కలవరం పుట్టిస్తోంది. తాజాగా కొవిడ్ 19 బాధితుల సంఖ్య 5,274కి చేరింది. కేవలం 24 గంటల్లోనే 485 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం (పిటిఐ వార్తాసంస్థ సేకరణ) దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5521కి, మరణాల సంఖ్య 172కి పెరిగాయి. 500 మంది రోగులు చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల్లో 71 మంది విదేశీయులే. గడిచిన 24 గంటల్లో 25 మంది మరణించారు. వారిలో ఆరుగురు మహారాష్ట్ర, ఇద్దరు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒకరు ఆంధ్రాకు చెందినవారుగా ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో పరిస్థితి దయనీయంగా వుంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 1078 కరోనాకేసులు నమోదు కాగా, వారిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కేసులు, మరణాలు ఈ రాష్ట్రం నుంచే సంభవించాయి. తబ్లిగీ జమాత్ ప్రభావం ఈ రాష్ట్రంలో ఎక్కువగా వుంది. మొదట్లో కేరళలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో వుంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 345తో నిలిచిపోగా, మరణాలు రెండే. ఇక్కడ మృతుల సంఖ్య పెరగకపోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే కారణం. ఇక తమిళనాడులో కేసులు 738కి పెరగ్గా, మరణాల సంఖ్య 8కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 397కి చేరింది. కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో 313 కేసులు నమోదుకాగా, వారిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ 363కు కేసులు పెరగ్గా, ఆరుగురు మరణించారు. కర్నాటకలో 181 కేసులు నమోదుకాగా, ఐదుగురు మరణించారు. గుజరాత్లో 179, హర్యానాలో 141 కేసులు నమోదుకాగా, ఆ రాష్ట్రాల్లో వరుసగా 16 మంది, ఇద్దరు చొప్పున మరణించారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 576కి పెరిగింది. 20 మంది రికవరీ కాగా, 9 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో కేసులు సంఖ్య 348కి పెరగ్గా, నలుగురు మరణించారు. 9 మంది డిశ్చార్జి అయ్యారు.