భారత్‌లో 4111కి చేరిన కొవిడ్ 19 కేసులు
సెంచరీ దాటేసిన కరోనా మరణాలు
రాష్ట్రాలు, కేంద్రం మధ్య పొంతని కుదరని కేసుల లెక్కలు
రాష్ట్రాల వాస్తవ గణాంకాలు, కేంద్రం డొంకతిరుగుడు
న్యూఢిల్లీ ః భారత్‌లో కరోనా వైరస్ ఊహించని విధంగా నాల్గవ దశలో తన ప్రతాపం చూపుతోంది. కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరువ కాగా, మృతుల సంఖ్య సెంచరీ దాటేసింది. అయితే కరోనా కేసుల గణాంకాల విషయంలో రాష్ట్రాలు అందిన సమాచారానికి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కలకు అసలు పొంతన కుదరడం లేదు. ప్రజలను భ్రమల్లో ఉంచడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లుగా కన్పిస్తోంది. రాత్రి 9 గంటలకు అందిన సమాచారం ప్రకారం, దేశంలో కొవిడ్ 19 కేసులు సంఖ్య 4111కి చేరగా, మరణాల సంఖ్య 126కి చేరింది. ఇప్పటివరకు 315 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం వెల్లడించింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, కేసుల సంఖ్య 3,577 కాగా, మరణాల సంఖ్య 83గా వుంది. వివిధ రాష్ట్రాల నుంచి అందిన డేటా ప్రకారం (పిటిఐ వార్తా సంస్థ అందించిన సమాచారం మేరకు), అండమాన్ నికోబార్ దీవుల్లో కేవలం పది కేసులు మాత్రమే నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసుల సంఖ్య 252కి చేరింది. ఐదుగురు డిశ్చార్జి కాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో 32 కేసులు నమోదు కాగా, ముగ్గురు రికవరీ అయ్యారు. ఒకరు మరణించారు. చండీగఢ్‌లో 18 కేసులు నమోదుకాగా, ముగ్గురు రికవరీ అయ్యారు. ఢిల్లీలో 503 కేసులు నమోదుకాగా, 18 మంది రికవరీ అయ్యారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కేసులు తిబ్లిగీ జమాత్ సమావేశంలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. గుజరాత్‌లో 122 కేసులు నమోదుకాగా, 11 మంది మరణించారు. హర్యానాలో 76 కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 15 కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. జమ్మూకశ్మీర్‌లో 106 కేసులు నమోదుకాగా, నలుగురు డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు. కర్నాటకలో 151 కేసులు నమోదుకాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కేరళలో 314 కేసులు నమోదయ్యాయి. 56 మంది రికవరీ అయ్యారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా కొత్తగా కేసులు తగ్గుముఖం పట్టాయి. మరణాల సంఖ్య కూడా రెండు మాత్రమే. లడఖ్‌లో 14 కేసులు నమోదుకాగా, మధ్యప్రదేశ్‌లో 182 మందికి కరోనా సోకగా, 13 మంది మరణించారు. ముగ్గురు రికవరీ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 748 కేసులు నమోదయ్యాయి. 56 మంది కోలుకోగా, 45 మంది మరణించారు. అత్యధిక మరణాలు ఈ రాష్ట్రం నుంచే సంభవించాయి. పంజాబ్‌లో 68 కేసులు నమోదుకాగా ఆరుగురు మరణించారు. రాజస్థాన్‌లో 210 కేసులు నమోదయ్యాయి. వారిలో ఐదుగురు మరణించారు. తమిళనాడులో 571 కేసులు పెరిగాయి. వారిలో ఐదుగురు మరణించారు. తమిళనాడులో తిబ్లిగి సమస్య తలనొప్పిగా మారినట్లు అనుమానిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 272కి పెరిగాయి. 11 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 276 కేసులు నమోదుకాగా, 21 మంది రికవరీ అయ్యారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లో 68 కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు. ఒడిశాలో 23 కేసులు, చత్తీస్‌గఢ్‌లో 10 కేసులు, అరుణాల్ ప్రదేశ్‌లో కేవలం ఒకేఒక్క కేసు నమోదైంది. అస్సాంలో 26, గోవాలో 7, జార్ఖండ్‌లో 3, మణిపూర్‌లో 2, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో నాలుగు కేసులు నమోదయ్యాయి.
పట్టుబడ్డ మలేసియన్ పౌరులు
నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొని, తమ స్వదేశానికి పారిపోతున్న 8 మంది మలేసియా పౌరులు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం పట్టుబడ్డారు. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఈ ఎనిమిది మందిని అధికారులు పట్టుకున్నారు. వీరు అప్పటివరకు ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో దాక్కున్నారని, మలేసియా హైకమిషన్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని తెలియగానే వీరంతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అధికారుల తనిఖీలో ఈ 8 మంది దొరికిపోయారు. వీరి రక్తనమూనాలను సేకరించి, టెస్టులకు పంపించారు. ఇదిలావుండగా, కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపిస్తుందన్న వాదన నిరూపితం కాలేదని కేంద్రం ప్రకటించింది. తబ్లిగీ జమాత్ కారణంగానే ఉన్నట్టుండి వైరస్ కేసులు రెట్టంపయ్యాయని, మరో ఏడు రోజుల్లో దీనికి సంబంధించి కేసులపై మరింత స్పష్టత వస్తుందని కేంద్రం ఆ ప్రకటనలో తెలిపింది.