తెలంగాణ ఉద్యమంలో తమ పాత్రను ముఖ్యమంత్రి విస్మరించారంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు , పెన్షనర్లకు జీతాల్లో సగం కోత విధించడం పట్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన పిఆర్‌సి ఇంత వరకు ఇవ్వక పోగా ఈ కోతలు విధించడం దారుణమని వారు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రెండు పిఆర్‌సిలతో పాటు మరిన్నింటినీ ప్రభుత్వం వాయిదా వేసిందని, అవి ఎప్పుడు వస్తాయా? అని కళ్లకు వత్తులు వేసుకుని నిరీక్షిస్తుంటే ఇప్పుడు జీతాల్లో కోతలు ఆశనిపాతంగా మారుతున్నాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడా పెడా కోతలు పెట్టడం చూస్తుంటే తెలంగాణ ఉద్యమంలో తమ పాత్రను ముఖ్యమంత్రి విస్మరించినట్లు భావిస్తున్నామని వారు అభిప్రాయపడుతున్నారు. జీతాలు పెంపుదల లేక పోగా కనీసం ఇవ్వవలసినవి కూడా ఇవ్వటం లేదని, ఈ కోతలు ఎన్ని నెలల పాటు ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఫిబ్రవరిలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియనిదికాదని, ఆదాయపన్ను (ఇన్‌కంటాక్స్ కటింగ్ ) పోను వచ్చే జీతాలు ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలామందికి నెల జీతం మొత్తం ఇన్‌కం ట్యాక్స్ కట్టడానికే సరిపోతుందంటున్నారు. ఉద్యోగుల హోదా వారికి వచ్చే జీతాలను బట్టి కొందరికి 50 శాతం కట్ అవుతుండగా, మరికొందరికి 20 నుండి 40 శాతం వరకు కట్ అవుతుందంటున్నారు. మార్చి నెల వచ్చిందంటే చాలు విద్యాసంవత్సరం ముగింపునకు వస్తుందని, ఈ పరిస్థితుల్లో పిల్లల స్కూల్ ఫీజు డ్యూ ఉన్న మొత్తం కట్టించుకుంటారని, లేదంటే విద్యార్థులను వివిధ రకాలుగా అవమానాలకు గురి చేస్తారని చెబుతున్నారు. అందుకే స్కూల్ ఫీజు మొత్తం అనివార్యంగా చెల్లించక తప్పదంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జీతాలకు కోత పెట్టడం ఏమాత్రం భావ్యం కాదంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉన్నవాళ్లేం కాదని, జీతాలు ఎట్టి పరిస్తితుల్లోనూ కోత విధించవద్దని కోరుతున్నారు. అంతే కాకుండా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు కూడా బిపిఎల్ కుటుంబాలకు ఇస్తున్నట్లే 12 కిలోల బియ్యం, రూ. 2000 ఇచ్చే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల జీతం కోసం ఎదురు చూసే వారిలో ప్రభుత్వ ఉద్యోగులు 90శాతం వరకు ఉంటారంటున్నారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ సాకుతో ప్రభుత్వం ఇచ్చే జీతాల్లో కోత విధించొద్దని ప్రభుత్వ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ కారెం రవీందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లలో ఉంటే తాము మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి డ్యూటీ లు చేస్తున్నామని, తమకు కనీసం మాస్క్‌లు, శానిటైజర్స్‌ను కూడా ఉచితంగా అందించడం లేదని నాలుగోతరగతి ఉద్యోగులు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతలు విధించడానికి పెన్షనర్లే దొరికారా?
రెగ్యులర్ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించినా వారు తట్టుకోవచ్చేమో గానీ, తాము మాత్రం తట్టుకోలేమని ప్రభుత్వ పెన్షనర్లు అంటున్నారు. తమకు వస్తున్నదే రూ. 5 వేల నుండి 15 వేలు అని ఆ మొత్తంలోనూ కోతలు విధిస్తే అనారోగ్యంతో ఉండే తాము నెల వారీగా కొనుగోలు చేసే మందులకు ఎక్కడి నుండి డబ్బులు తెచ్చుకోవాలని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుటాకులమైన తమ పట్ల ప్రభుత్వం కనికరం చూపి కోతల నుండి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని విద్యాశాఖలో రిటైర్డ్ అయిన ఒక పెన్షనర్ “ప్రజాపక్షం”తో వాపోయారు.
జీతాల్లో కోతపై ఆగ్రహ జ్వాలలు
RELATED ARTICLES