మర్కజ్ మరణ మృదంగం మ్రోగిస్తుందా..!
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1085 మంది గుర్తింపు
585 మందికి పరీక్షలు
70 మందికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్‌లోనే అధికం
హైదరాబాద్ : అంతా సమసిపోతోంది, ఏప్రిల్ ఏడు నుంచి రాష్ట్రం ఫ్రీ కరోనాగా మారిపోతుంది అన్న ధీమాను ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తం చేసిన మరుసటి రోజే రాష్ట్రంలో ఢిల్లీ కరోనా సునామీని సృష్టించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రధాన కేంద్రంగా తబ్లీగ్ ఎ జమాత్ అనే సంస్థ నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలు, కార్యక్రమాలు, సమావేశాల్లో రాష్ట్రం నుంచి వేయికి పైగా పాల్గొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. వీరిలో చాలా మందికి కరోనా సోకినట్లు సమాచారం. అయితే వీరు స్వచ్ఛందంగా క్వారంటైన్ తీసుకోకుండా, వైద్య పరీక్షలు చేయించుకోకుండా వారి వారి ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ సంచరించడంతో ఇతరులకు వేగంగా కరోనా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఒకే రోజు తెలంగాణలో ఆరుగురు మరణించడం వీరంతా ఢిల్లీ ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారుగా గుర్తించడంతో మర్కజ్‌గిరి రాష్ట్రంలో మరణమృదంగం మ్రోగిస్తుందా అన్న అనుమానాలు, భయాలు అటు అధికార వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఇంటలిజెన్స్ వ్యవస్త ఢిల్లీ వెల్లి వచ్చిన వారిని గుర్తించి వారిని ఆసుపత్రులకు తరలించడం, క్వారంటైన్‌కు తరలించడం వంటి పనిలో నిమగ్నమైంది. అయితే ఢిల్లీ వెల్లి వచ్చిన వారు స్వచ్చంధంగా రావాలని, క్వారంటైన్ కావాలని, ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఎంత విజ్ఞప్తులు చేస్తున్నప్పటికి ఆశించిన ఫలితం కనిపించడం లేదు. నిజానికి తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు దాదాపు 2030 మంది వెళ్ళి వచ్చినట్లు వార్తులు షికారు చేస్తుండగా అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు 1085 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 70 మందికి పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ అధికారికంగా దృవీకరించలేదు. మర్కజ్‌గిరి రాష్ట్రంలో మృత్యుఘంటికలు మ్రోగించనుంది అనడానికి బలమైన సంకేతాలే రోజురోజుకు కనపడుతుండంంతో ఆందోళన మాత్రం తీవ్రమైంది. ఈ తరుణంలో వీరి వివరాలను పూర్తిగా కనుగొనే విషయాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా తీసుకుంది. డిజిపి మహేందర్ రెడ్డి ఈ విషయంలో రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. వీలైనంత త్వరలో గుర్తించి క్వారంటైన్‌కు, ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ వెల్లి వచ్చిన వారు స్వచ్ఛంధంగా వారి వారి పోలీస్టేషన్లలో రిపోర్ట్ చేయాలని విన్నవించారు. కరీంనగర్ జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వారిలో ముగ్గురు మరణించారని కరీంగనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ బుధవారం వెల్లడించారు. ఇది కూడా మర్కజ్‌గిరి ప్రార్థనల తీవ్రత మన రాష్ట్రంలో ఎంతగా పెరిగిపోతోందో అన్నదానిని సూచిస్తోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో దాదాపు 64 మందికి కరోనా పాజిటివ్ తేలడం, వీరంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబీకులు, బంధువులు కావడం కూడా పరిస్థితి ఎంత విషమంగా మారుతోందో అన్న దానిని సూచిస్తోంది. బుధవారం నాటి పరిస్థితులను గమనిస్తే కూడా రాష్ట్రంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చి చికిత్సల కోసం వచ్చిన వారిలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఇద్దరికి పాజిటివ్ తేలగా వారిని జగిత్యాల క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అలాగే మంచిర్యాలలో ఇద్దరికి పాజిటివ్ తేలగా వారిని బెల్లంపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. సిద్దిపేటలో ఒకరికి పాజిటివ్ తేలగా ఇతను గజ్వేల్ ప్రాంతంలో సంచరించినట్లుగా గుర్తించారు. తెలంగాణ నుంచి ఢిల్లీలోని మర్కజ్‌గిరి ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిలో హైదరాబాద్ వాసులే దాదాపు సగానికి పైగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పాత బస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. వీరంతా ఢిల్లీ ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారు, వారి బాధితులే. అంతే కాదు ఇప్పటికి నగరంలో ఢిల్లీ ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారు స్వచ్చంధంగా ముందుకు రాకుండా వివిధ ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. వీరంతా నగరంలోని 16 మసీదుల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. వీరితో పాటు విదేశీయులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాల అమిర్‌ల పర్యవేక్షణలో మసీదుల్లో చిల్లా కార్యక్రమాలు చేపట్టారన్న మరో విషయం కూడా తాజాగా వెలుగుచూసింది. ప్రార్థనలకు కేంద్ర బిందువైన నిజాముద్దీన్ ప్రాంతంలో ఇప్పటివరకు 2361 మందిని క్వారంటైన్‌కు తరలించగా మరో 617 మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 1203 తబ్లిక్ జమాత్ కార్యకర్తలను పరీక్షించగా వారిలో 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో వీరిని ఢిల్లీలోని నరేలా, బక్కర్‌వాలా, సుల్తాన్‌పురి ప్రాంతాల్లోని నిర్భంధ కేంద్రాలకు తరలించారు.
తెలంగాణలో ఢిల్లీ కరోనా సునామీ
RELATED ARTICLES