అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి : సిఎంకు అఖిలపక్షాల లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ : ఉద్యోగుల జీతాలను సగానికిపైగా తగ్గించడం సరికాదని సిపిఐ, సిపిఐ(ఎం) తదితర వామపక్షాలు, టిజెఎస్, టిడిపిలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగాల వేతనాలను తగ్గించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే కరోనా విపత్కర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్టీలు ఉమ్మడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశాయి. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిజెఎస్ అధినేత ఎం.కోదండరాం, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, పి.రంగారావు, సాదినేని వెంకటేశ్వరరావు (సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ), తాండ్ర కుమార్ (ఎంసిపిఐ యు), జానకిరాములు (ఆర్ఎస్పి), ప్రసాద్ (సిపిఐ ఎంఎల్), ఎం.రాజేష్ (సిపిఐ ఎంఎల్ లిబరేషన్), బి.సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్)లు వున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్పొరేషన్ కార్మికులు, ఉద్యోగులకు ఈ నెల సగం జీతమే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని, జీతాల మీదే ఆధారపడే ఉద్యోగులకు ఇది ఆశనిపాతమని వారు తమ లేఖలో ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే ఉపాధ్యాయ, ఉద్యోగులు మనోవేదనకు గురవుతుంటే, 21 రోజుల లాక్‌డౌన్‌కే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని చెప్పడం సమగ్రమైంది కాదన్నారు. వందల కోట్ల ఆదాయాలు కలిగివున్న కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, గ్రామాల్లోని ధనికవర్గాలకు ఇచ్చే రాయితీలను తగ్గించడం, అదనపు పన్నులు వేయడం ద్వారానే ఆదాయ వనరులను సేకరించాలే తప్ప నెలవారీ జీతాలపై ఆధారపడే ఉద్యోగుల పట్ల ఈ విధానం అవలంబించడం విరమించుకోవాలని, ఈ విపత్కర పరిస్థతులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.